"టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్న ప్రాంతీయ హద్దులు చెరిగిపోవాల"న్నారు మెగాస్టార్ చిరంజీవి. ఏ భాషలో తెరకెక్కిన చిత్రమైనా సరే.. అది ఇండియన్ సినిమాగానే పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు ఆయన. మంచి పాత్రలొస్తే.. ఇతర భాషల్లో నటించడానికీ సిద్ధమేనని ప్రకటించారు. మన ఎల్లలు చెరిపేసుకోవడానికి ఇలాంటి అవకాశాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఆయన హీరోగా నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే విలేకర్లతో ముచ్చటించారు చిరు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలివి..
ఇన్నేళ్ల కెరీర్‌లో మీరు చాలా హిట్లు, ప్లాప్‌లు చూశారు. కానీ, ఈ 'గాడ్‌ఫాదర్' విజయం ఏమైనా ప్రత్యేకం అనిపిస్తుందా?
"హిట్టొచ్చిందని ఒక్కడినే ఆనందపడిపోవడం.. పరాజయాన్ని తలచుకొని కుంగిపోవడం నాకు తెలియదు. అలాంటి మానసిక పరిస్థితి నుంచి నేనెప్పుడో బయటకొచ్చేశాను. ఫలితం ఏదైనా కావొచ్చు.. అది నా ఒక్కడిదే అనుకోను. ప్రతి దాని వెనుక సమష్టి కృషి ఉంటుంది. మంచి, చెడు.. అందరికీ వర్తిస్తుంది. 'ఆచార్య' ఫ్లాప్ అని తెలిశాక.. నా వంతు ధర్మం ఏం చెయ్యాలో అది చేశాను. నేను.. రామ్‌చరణ్ 80శాతం పారితోషికాన్ని తిరిగిచ్చేశాం. దీని వల్ల పంపిణీదారుల వరకైనా సేఫ్ అవుతారన్న సంతృప్తి.. నన్ను ఆ ఫ్లాప్ కుంగిపోయేలా చేయలేదు. ఇప్పుడీ విజయం కూడా 'నా ఒక్కడిదే' అని నేను అనుకోవడం లేదు. మా అందరి విజయమిది. సమష్టి కృషికి దక్కిన ఫలితమిది. పాటలు, వినోదం.. భీభత్సమైన పోరాటాలతో ముగింపు.. ఈ తరహా మూస కథల నుంచి బయటపడితే బాగుంటుందన్న ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది. అయితే అలాంటి ప్రయత్నం నేనెప్పుడూ చేయలేదు. కానీ, ఇప్పుడు 'గాడ్‌ఫాదర్' ద్వారా ఆ కోరిక నెరవేరింది. ఈ విజయం కొత్త ఒరవడి కథలకు నాంది పలుకుతుందని నమ్ముతున్నా".
'లూసీఫర్' చాలా మందికి చేరువైన చిత్రం. దీన్ని రీమేక్ చేయాలి అనుకున్నప్పుడు ఏమైనా సంకోచించారా?
"మూస ధోరణి వద్దు.. నాకంటూ ఓ కొత్తదారి ఏర్పరచుకోవాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఈ 'లూసీఫర్' కథ నా దారికొచ్చింది. అయితే అప్పటికే ఈ సినిమా ఓటీటీ వేదికగా అందరికీ చేరువైందని తెలుసు. కాకపోతే దీన్ని కొత్తగా..ఆకట్టుకునేలా తిరిగి ప్రెజెంట్ చేయగలిగితే.. మనకున్న ఇమేజ్‌కు, ఆదరణకు ప్రేక్షకులు మళ్లీ థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తారన్న ధైర్యం ఉంది. ఆ నమ్మకమే ఈ చిత్రం పునర్నిర్మించేందుకు మాకు దోహదం చేసింది. అయితే ఇంతలా ప్రేక్షకులకు చేరువైన కథల్ని రీమేక్ చేయడమన్నది చాలా సవాల్‌తో కూడుకుని ఉంటుంది. కచ్చితంగా మాతృకతో పోలికలు వస్తాయి. అయితే ఈ చిత్ర విషయంలో మేము చేసిన మార్పుల వల్ల ప్రేక్షకులు మాతృకను మర్చిపోయేలా చేయగలిగాం. ఇదనే కాదు.. నేను గతంలో చేసిన రీమేక్ సినిమాలు 'ఠాగూర్', 'ఘరానా మొగుడు' వంటివన్నీ మాతృక కంటే మిన్నగా ఉన్నాయే తప్ప ఎక్కడా తగ్గింది లేదు".
ప్రస్తుతం తెలుగులో అగ్ర హీరో సినిమా అనగానే రీమేక్ కథల వైపు మొగ్గు చూపాల్సి వస్తోంది. ఎందుకిలా? అగ్ర హీరోల విషయంలో కథల కొరత కనిపిస్తుందా?
"ఇది కథల కొరత వల్ల కాదండి.. ఇలాంటి కథలు చేయాలన్న సంకల్పం, ఆ ఆలోచనా ధోరణి మా హీరోలకు ఉండాలి. అయితే మాకెందుకు లేదన్న దానికి కొన్ని కారణాలున్నాయి. ముఖ్యంగా ప్రేక్షకులకు మాపై ఉన్న అంచనాలు. వాళ్లు మా నుంచి ఓ తరహా చిత్రాలు చూసున్నారు. దానికి అలవాటు పడ్డారు. మీకొక ఉదాహరణ చెబుతా. 'ఠాగూర్' మాతృకైన 'రమణ'ను రీమేక్ చేయాలనుకున్నప్పుడు మేము తొలుత దర్శకుడిగా మురుగదాస్‌ని అనుకున్నాం. ఆయన సినిమా చూసి.. దీన్ని ఇలాగే తీస్తే చాలా డ్రైగా ఉంటుందని చెప్పారు. ఎందుకంటే దాంట్లో పాటలు లేవు. క్లైమాక్స్‌లో హీరో పాత్ర కన్నుమూస్తుంది. 'మీ మీద ఇలా తీస్తే ప్రేక్షకులు ఎక్కడ చూస్తారండి బాబూ.. హీరో పాత్ర చచ్చిపోతే నిర్మాత మునిగిపోయినట్లే' అన్నారు ఓ మిత్రుడు. దీనికి తోడు మన సినిమాల బడ్జెట్‌లు, అమ్మకాలు వేరు. పెద్ద ఎత్తున ఖర్చు చేసి తీస్తున్నప్పుడు.. అదే స్థాయిలో వసూళ్లు రావాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిమితుల వల్ల కూడా ప్రయోగాలు చేయడానికి వెనకాడాల్సి వచ్చేది. ఇలాంటి పరిస్థితుల్లో సురక్షితం అనిపించిన కథల్ని రీమేక్ చేసుకోవడమన్నది మేలైన మార్గంగా ఉండేది. ఇలా కాదు.. మాది చిన్న బడ్జెట్ సినిమా, 35రోజుల్లో చిత్రీకరణ పూర్తయిపోతుంది.. ఏమైనా ఫ్లాప్ అయినా రూ.కోటి, అర కోటి కంటే నష్టపోమని అనండి ఇంతకంటే మించిన ప్రయోగాలు చేయడానికి మన హీరోలంతా రెడీగా ఉన్నారు. కానీ, మన పరిస్థితి ఇది కాదు. ఇక్కడ మన సినిమాల పరిధి ఎక్కువ. థియేటర్లు ఎక్కువ. దీనిపై ఆధారపడిన వారు ఎక్కువ. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సేఫ్ బెట్ అన్నది సర్వసాధారణం అయిపోయింది. అయితే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచుల్లో చాలా మార్పులొచ్చాయి. అందుకే ఇప్పుడా మార్పును మేము అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం".
ఇకపై ఎలాంటి కథలతో ముందుకెళ్లాలి అనుకుంటున్నారు? ప్రస్తుతం చేస్తున్న చిత్రాల విశేషాలేంటి?
"పాటలు, ఫైట్లు కచ్చితంగా ఉండాలని ఎన్నాళ్లు చేయగలుగుతాం. నాకైతే వీటి నుంచి కొంచెం దూరం వచ్చి బలమైన కథలు, పాత్రలతో నన్ను నేను కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవాలనుంది. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలన్నీ వేసవి నాటికి విడుదలవుతాయి. మార్చి నుంచి కొత్త చిత్రాలు ప్రారంభిస్తా. బాబీ సినిమాలో నా పాత్ర ఫుల్ మాస్ లుక్‌లో ఉంటుంది. సంభాషణలన్నీ తూర్పుగోదావరి జిల్లా యాసలో ఉంటాయి. దీనికి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ నేనే పెట్టా. 'భోళా శంకర్' కూడా చాలా బాగుంటుంది".
"నా రాజకీయ పార్టీ లేకపోవడం వల్ల నేను బాగానే ఉన్నా. ప్రజారాజ్యం పార్టీ కొనసాగి ఉండుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదోక దానికే పరిమితమయ్యేవాణ్ని. పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు పరిమితమై.. తెలంగాణను వదులుకోవాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు నటుడిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆదరిస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రజలకు దగ్గరగా ఉండగలుగుతున్నా. కాబట్టి పార్టీ లేకపోవడమే నాకు బాగుందనిపిస్తోంది".
ఇదీ చూడండి: ఆ సినిమా ఫ్లాప్.. రెమ్యునరేషన్ తిరిగిచ్చేసిన చిరంజీవి