Chiranjeevi About Daddy Movie: హీరో ఇమేజ్‌ను బట్టి సినిమా కథ, యాక్షన్, భావోద్వేగాలు ఉండాలి. అలా లేనప్పుడు ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే ప్రేక్షకులు అక్కున చేర్చుకోరు. తన సినిమా కథల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. కొన్నిసార్లు ఫలితం వేరేలా ఉన్నా, ఎక్కువశాతం అభిమానులను అలరించేందుకే ప్రయత్నిస్తారు. కొన్ని కథలు తనకన్నా తోటి హీరోలకు బాగుంటుందని సలహాలు కూడా ఇస్తారు. అలాంటి చిత్రాల్లో 'డాడీ' ఒకటి. సురేశ్‌కృష్ణ దర్శకత్వంలో 2001లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. అయితే, చిరంజీవి మార్కు సూపర్‌హిట్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఈ సినిమా కథ చెప్పగానే మరొక ఆలోచన లేకుండా వెంకటేశ్‌కైతే బాగుంటుందని చిరంజీవి సలహా ఇచ్చారట. ఆనాటి సంగతులను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరు పంచుకున్నారిలా..!
"డాడీ' కథను నాకు వినిపించారు. వినగానే ఇది నాకంటే వెంకటేశ్‌కు బాగుంటుందనిపించింది. ఈ కథకు తను న్యాయం చేయగలడనుకున్నా. రచయిత భూపతి రాజాకు ఇదే విషయం చెప్పా. 'ఇది ఆయనకు మామూలుగా ఉంటుంది. మీకైతే ఫ్యామిలీమెన్‌గా కాస్త వెరైటీగా ఉంటుంది' అని భూపతిరాజా నన్ను కన్విన్స్ చేశారు. అయినా నేను కాస్త తటపటాయించా. ఈ కథ విన్న వారందరూ 'చిన్న పిల్లతో ఈ సినిమా మీకు బాగుంటుంది' అని సలహా ఇచ్చారు. చివరకు నేను కూడా బలవంతంగా ఒప్పుకున్నా. రిజల్ట్ కూడా అలాగే ఉంది. కథ విన్నప్పుడు ఏమనుకున్నానో అదే జరిగింది. సినిమా విడుదలైన తర్వాత వెంకటేశ్ నాకు ఫోన్ చేసి 'భలే సినిమా అండీ. నా మీద అయితే ఇంకా బాగా ఆడేదండీ' అనేశాడు. 'నీకైతే బాగుండేదని నేను చెప్పాను వెంకటేశ్. కానీ వినలేదు' అని అన్నాను. అలాంటి కొన్ని ఫెయిల్యూర్స్ నా సినీ జీవితంలో ఉన్నాయి" అని చిరంజీవి చెప్పుకొన్నారు. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మోహన్‌రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్', మెహర్ రమేశ్ సినిమా 'భోళా శంకర్', బాబీ దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇవీ చదవండి: పవన్ కల్యాణ్ 'జల్సా' రీరిలీజ్.. కొత్త ట్రైలర్ ఇదిగో...
అమలాపాల్‌కు లైంగిక వేధింపులు.. అతడే బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు