Brahmanandam Autobiography : టాలీవుడ్ నవ్వుల 'రారాజు' బ్రహ్మానందం తన జీవితకథను వివరిస్తూ ఓ పుస్తకం రాశారు. 'నేను-మీ బ్రహ్మానందమ్' అనే పేరుతో ప్రచురితమైన తన ఆటోబయోగ్రఫీ కాపీని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాల తన సినీ ప్రయాణంలో తాను కలిసిన వ్యక్తులు, తెలుసుకున్న విషయాలు, తనకు ఎదురైన జీవితానుభవాలను రంగరించి 'నేను-మీ బ్రహ్మానందమ్' అనే ఆత్మకథగా అందించారు బ్రహ్మానందం. ఈ నేపథ్యంలో ఆయన 'నేను-మీ బ్రహ్మానందమ్' పుస్తకం గురించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.
ఆత్మకథకి 'నేను' అనే పేరు పెట్టడానికి కారణం ఏమిటి?
ఇది నేను, నా జీవితం అని తెలియడం సహా అందులో తాత్వికత కూడా స్పురించాలన్న ఆలోచనతో పెట్టిన పేరే 'నేను'. నేను ఎవరిని అని తెలుసుకోవడం గురించే కదా రమణ మహర్షి చెప్పారు. నాదైన జీవితం నుంచి వచ్చింది కూడా కావడం వల్ల నా ఆటోబయోగ్రఫీకి 'నేను-మీ బ్రహ్మానందమ్' అని పేరు పెట్టా.
ఆత్మకథ రాయడానికి సరైన సమయం ఇదే అనిపించిందా? లేక ఇతర కారణాలేమైనా మిమ్మల్ని ప్రేరేపించాయా?
నేను సెల్ఫ్ ఎడిటింగ్ ఉన్న మనిషిని. నా గురించి నేను గొప్పగా ఆలోచించుకోవడం కంటే, నన్ను నేను పొగుడుకోవడంకంటే విమర్శించుకోవడమే నాకు ఎక్కువ. వచ్చి పది చిత్రాలు చేయగానే ఆత్మకథ మొదలు పెట్టామనుకోండి, ఇతడికి ఏం ఆత్మ ఉందని, దానికి ఏం కథ ఉందని అప్పుడే మొదలుపెట్టాడు అని అనుకుంటారు. నటుడిగా ఇంత సుదీర్ఘమైన ప్రయాణం ఉన్నప్పుడే నా ప్రయాణంలోని అనుభవాల్ని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఆత్మకథ రాయడం మొదలుపెట్టాక పూర్తి చేయడానికే రెండేళ్లు సమయం పట్టింది. ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై రాయడం కాదు కదా, దాదాపు 70 ఏళ్లు వెనక్కి వెళ్లి రాయల్సి వచ్చింది.
ఆత్మకథలనగానే జీవితంలోని ఎత్తు పల్లాలు, వివాదాలు, సంచలనాలు గుర్తొస్తుంటాయి. మీరు కూడా వాటిని స్పృశించారా?
నా ఆత్మకథ వైవిధ్యంగా ఉండాలనేది నా కోరిక. ఏదో ఒక సంచలన విషయాన్నో లేదంటే వివాదాన్నో స్పృశించి దాంతో పుస్తకానికి ఓ భావోద్వేగాన్ని ఆపాదించి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో రాసింది కాదు ఈ పుస్తకం. దేవుడి దయవల్ల అన్ని రకాలుగా నేను ఆనందంగా ఉన్నాను. నా ఈ జీవితం నుంచి తర్వాత తరం ఏం తెలుసుకుంటుంది? వాళ్లకి ఎలా ఉపయోగపడుతుందనే కోణంలోనే ఆలోచించి ఈ ఆత్మకథ మొదలు పెట్టా.
నేనే గొప్పవాణ్ని అని కొందరు అనుకుంటారు. అదేమీ కాదు, అంతా ఆ దేవుడి దయ అని ఇంకొంతమంది అభిప్రాయపడతారు. మరి ఇందులో నా కోణం ఏది? నా కష్టం, దానికి భగవంతుడి సాయం తోడైతేనే పరిపూర్ణమైన ప్రతిఫలం అని నేను నమ్ముతాను. ఇలాంటి ఆలోచనలతోపాటు, మరెన్నో విషయాలు ఈ ఆటోబ్రయోగ్రఫీ ఉంటాయి.
మీలోని తాత్విక ఆలోచనల ప్రభావమే ఈ ఆత్మకథపై ఎక్కువ ఉన్నట్టుంది?
తాత్వికత, వేదాంతం అని రకరకాల అభిప్రాయాలు వస్తుంటాయి. నా దృష్టిలో వేదాంతం అనేది, నిజం అనేది వేర్వేరు కాదు. 'అతడు రాత్రి ఒంటి గంట వరకు కూడా మాతోనే కూర్చున్నాడు. సరదాగా మాట్లాడుకున్నాం. ఉన్నట్టుండి ఇంటికి పయనమయ్యాడు. ఈ సమయంలో ప్రయాణాలు వద్దురా అన్నా వినలేదు. ప్రమాదం జరిగింది, పోయాడు' అంటాం. ఇక్కడ అతను రాత్రి 1 గంట వరకూ ఉండటం నిజం, సరదాగా మాట్లాడటం నిజం. ప్రమాదంలో మకణింటడమూ నిజమే. చివర్లో ఆ ప్రమాదానికి వేదాంతం అద్ది 'అతడి కర్మ అలా ఉంది. అతడికి మృత్యువు అలా దగ్గరైంది, లేకపోతే అప్పటిదాకా మాతో ఉండటం ఏంటి? వద్దన్నా వినకుండా వెళ్లడమేంటి' అంటూ ఉంటాం. మరిక్కడ వేదాంతం ఉందా? నిజం ఉందా? ఇవి రెండూ కలిసే ఉంటాయి. ఏది కావల్సినవాళ్లు దాన్ని తీసుకుంటారు. నాస్తికుడిగా ఉండాలనుకునే వాడు అలాగే ఉంటాడు. తాను ఆస్తికత్వాన్ని నమ్ముతాననుకునే వారు అలానే మాట్లాడతారు. అందరూ మనుషులే అనే భావనే ఈ పుస్తకంలో ఉంటుంది. అదెక్కువ, ఇది తక్కువ అని కాకుండా నా జీవితంలో ఏది ఉంటే అది రాశా. అందుకే నా పుస్తకంలో అన్నీ ఉండవు, అంతా ఉంటుందని చెబుతున్నా.
ఈ పుస్తకం రాస్తున్నప్పుడు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేసిన అంశాలు ఏమిటి?
ధనవంతుడు ఎవడో పేదవాడు ఎవడో తెలియని వయసే బాల్యం. పక్కనోడికి ఉన్నాయి, నాకు లేవు తను మంచి డ్రెస్ వేసుకున్నాడు, నాకు లేదనే తారతమ్యాల గురించి పూర్తిగా స్పృహ లేని దశ ఒకటి ఉంటుంది. నా జీవితంలో అదొక అందమైన అధ్యాయం. దాన్ని నేను చాలా ఇష్టపడతాను. ఆ ఘట్టాన్ని మరోసారి గుర్తు చేసుకున్నప్పుడు అది అక్షరబద్ధమైనప్పుడు నాకు తెలియని అనుభూతి కలిగింది.
మీ జీవితం ఆధారంగా మరికొన్ని పుస్తకాలు కూడా వస్తున్నాయని తెలిసింది? ఆ వివరాలు చెబుతారా?
బ్రహ్మానందం ఫొటో బయోగ్రఫీ అని ఒక పుస్తకం వస్తుంది. సంజయ్ కిశోర్ రాస్తున్నారు. అందులో నేను వేసిన బొమ్మలు, చిత్రలేఖనం అభిరుచి ప్రస్తావన కూడా ఉంటుంది. నా సినిమా జీవితానికి సంబంధించిన విశ్లేషణని ఓ పుస్తకంగా రాస్తున్నారు శ్రీకాంత్ కుమార్. ఏయే చిత్రాల్లో ఎలా నటించాననే విషయాలు అందులో ఉంటాయి. ఇక వివాదాలు అంటున్నారు కదా, పేర్లు ఉచ్ఛరించకుండా అది కూడా అందరికీ ఉపయోగపడేలా అందమైన రీతిలో ఓ పుస్తకం రాద్దామనే ఆలోచన ఉంది. అందులో చిన్నప్పుడు పడిన అవమానాలు మొదలుకొని నాపైన అభిమానం, పొగడ్తలు, తెగడ్తలు అన్నీ ఉంటాయి.