Kangana Ranaut Karan Johar : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ ఎప్పుడూ ఎవరినో ఒకరిపై కామెంట్ చేస్తూ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటారు. బీటౌన్‌లో తాజాగా 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ' అనే సినిమా విడుదలైన తరుణంలో ఆమె ఆ సినిమా దర్శకుడు కరణ్ జోహార్‌తో పాటు హీరో రణ్‌వీర్ సింగ్‌కు చురకలు అంటించారు. సోషల్ మీడియా వేదికగా తనదైన స్టైల్లో ఘాటు విమర్శలు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఈ చెత్త సినిమాకు రూ.250 కోట్లా?
Kangana Ranaut Insta Story : కరణ్ జోహార్ దర్శకత్వంలో ఆలియా భట్, రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్స్‌లో తెరక్కెక్కిన 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ' సినిమా జూలై 28న గ్రాండ్‌గా రిలీజైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తొలి రోజు సుమారు రూ.11 కోట్ల మేర వసూళ్లను రాబట్టింది. అయితే ఈ విషయంపై దీనిపై మూవీ క్రిటిక్ గిరీశ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ', 'బ్రో' లాంటి సినిమాలు అంచనాలకు తగ్గట్లుగా ఆడటం లేదు. అందుకనేమో అందరి కళ్లు వంద కోట్లకు చేరువలో ఉన్న హాలీవుడ్ మూవీ 'ఓపెన్‌హైమర్' మీదే ఉంది' అంటూ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని రాసుకొచ్చారు. ఇక ఈ విషయంపై స్పందించిన కంగనా.. ఆ ట్వీట్‌ను స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే కాకుండా సినిమాపై విమర్శలు గుప్పించారు.
'జనాలేమీ పిచ్చోళ్లు కారు. ఇలాంటి పేలవ సినిమాలను వారు తిరస్కరిస్తారు. అసలు ఆ కాస్ట్యూమ్స్, సెట్ అంతా కూడ నకిలీనే. 90వ దశకంలో కరణ్ జోహార్ ఏం చేశాడో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. నీ పని నువ్వే కాపీ చేస్తున్నావు. నీకు సిగ్గనిపించడం లేదా? సీరియల్ లాంటి ఈ చెత్త సినిమాకు రూ.250 కోట్లు ఎలా ఖర్చు పెట్టావో? నిజంగా టాలెంట్ ఉన్నవాళ్లు ఓ వైపు ఇబ్బందులు పడుతుంటే వీళ్లేమో కోట్లకు కొద్ది డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నారో?' అంటూ తన అభిప్రాయాన్ని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు.
Kangana Ranaut Ranveer Singh : ఇక ఇదే వేదికగా రణ్‌వీర్ సింగ్‌కు సలహా కూడా ఇచ్చారు. 'మూడు గంటల నిడివి ఉన్నా సరే జనాలు 'ఓపెన్‌హైమర్' సినిమానే చూస్తున్నారు. కానీ నీకు నువ్వేదో పెద్ద ఫిలిం మేకర్ అని చెప్పుకుంటావు కానీ నీ పతనం ఎప్పుడో మొదలైంది. అనవసరంగా డబ్బులు వృథా చేయకుండా రిటైర్‌మెంట్ తీసుకో. అప్‌కమింగ్ డైరెక్టర్స్‌కు అవకాశం ఇవ్వు. అలాగే సినిమా హీరో రణ్‌వీర్ సింగ్‌కు నా నుంచి ఓ చిన్న విన్నపం. కరణ్ జోహార్ బాటలో నువ్వు నడవకు. అతడిలా మారకు. ధర్మేంద్ర, వినోద్ ఖన్నాలా లాంటి సీనియర్ స్టార్స్‌లా మంచి బట్టలు వేసుకో. సౌత్ హీరోలు ఎలా ఉంటారో కనీసం వాళ్లని చూసైనా నువ్వు నేర్చుకో. నీ వేషధారణతో మన సంస్కృతిని నాశనం చేయకు' అంటూ రాసుకొచ్చారు.