బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రాజెక్ట్-కె సినిమాలో భాగంగా పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆయన గాయాలపాలయ్యారు. హైదరాబాద్‌లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన.. తన స్వగృహానికి చేరుకున్నారు. కోలుకోవడానికి ఇంకొన్ని వారాల సమయం పడుతుందని ఆయన తెలిపారు. ఈ ఘటన మార్చి 4న జరిగినట్లు సమాచారం.
"హైదరాబాద్‌లో ప్రాజెక్ట్- కె షూటింగ్‌లో భాగంగా యాక్షన్ షాట్ సమయంలో గాయపడ్డాను. దీంతో కుడి పక్కటెముక విరిగింది. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లోని సీటీ స్కాన్ తీయించుకున్నాను. షూట్ రద్దు చేసుకుని డాక్టర్‌ను సంప్రదించి చికిత్స పొందాను. ప్రస్తుతం ముంబయిలోని జల్సాలో విశ్రాంతి తీసుకుంటున్నాను. డాక్టర్లు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. ప్రస్తుతం ఊపిరి తీసుకునేటప్పుడు నొప్పిగా ఉంది. ఈ రోజు సాయంత్రం ఎవరూ నన్ను కలవడానికి రావొద్దు" అని అమితాబ్ బచ్చన్ బ్లాగ్‌లో వెల్లడించారు.
అమితాబ్ గాయపడ్డారన్న వార్త తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అయితే ప్రాజెక్ట్-కె సినిమా రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ఇటీవలే తెలిపింది. 2024 సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పింది. వచ్చే ఏడాది జనవరి 12న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అమితాబ్ గాయపడినందున సినిమా విడుదల మళ్లీ వాయిదా పడుతుందని నెటిజన్లు అంటున్నారు.
ప్రాజెక్ట్-కెలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఆడిపాడనుంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ కనువిందు చేయనుంది. మహానటి ఫేమ్ డెరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో సుదీర్ఘమైన అయిదు యాక్షన్ బ్లాకులు ఉన్నట్లు సమాచారం.