2023లో విడుదలైన చిన్ని సినిమాల్లో పెద్ద విజయం సాధించిన చిత్రంగా బలగం నిలిచింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం.. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. రిలీజ్ అయ్యి మూడు వారాలు దాటినా.. రోజుకు రెండు కోట్లకుపైగా వసూళ్లు సాధిస్తోంది. ఈ శుక్రవారం నాటితో నాలుగో వారంలోకి బలగం సినిమా ఎంటరైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నాలుగైదు వందలకుపైగా థియేటర్లలో ఈ సినిమా స్క్రీనింగ్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఈ సినిమా శుక్రవారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. థియేటర్లలో చక్కటి వసూళ్లతో దూసుకుపోతుండగానే ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కావడంపై సోషల్ మీడియాలో దిల్‌రాజుతో పాటు ఆయన నిర్మాణ సంస్థను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇలా చేస్తే భవిష్యత్తులో థియేటర్లు నడవడం కష్టమేనని కామెంట్లు పెడుతున్నారు.
చిన్న సినిమా కావడంతోనే థియేటర్‌లో నడుస్తుండగానే ఓటీటీలో రిలీజ్ చేశారని ఓ నెటిజన్ ఆరోపించాడు. స్టార్ హీరోల సినిమాలకు ఇలాగే చేస్తారా అని ప్రశ్నించాడు. అయితే ఓటీటీ సంస్థతో దిల్‌రాజు చేసుకున్న ముందస్తు ఒప్పందం మేరకు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఓటీటీ రిలీజ్.. హీరోకే తెలియదా?
బలగం ఓటీటీ రిలీజ్‌పై హీరో ప్రియదర్శికి ముందుగా సమాచారం లేనట్లుగానే కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ వార్తలపై స్పందించిన ప్రియదర్శి.. ఇప్పట్లో ఈ సినిమా ఓటీటీలోకి రాదని, థియేటర్లలోనే చూడండి అంటూ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత తన ట్వీట్‌ను డిలీట్ చేశాడు.
ఉగాది నంది పురస్కారం..
తాజాగా ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. తెలుగు కొత్త సంవత్సరాది శోభకృత్ నామ సంవత్సరం పురస్కరించుకొని తెలుగు సినిమా వేదిక ఆధ్వర్యంలో బలగం చిత్ర యూనిట్‌ను ఉగాది నంది సత్కారంతో సత్కరించారు. బలగం చిత్ర నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హర్షిత, దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య, ఇతర నటీ నటులు సాంకేతిక నిపుణులను ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం, ఆర్ నారాయణ మూర్తి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు ఘనంగా సత్కరించారు.
మరణం నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ దర్శకుడు వేణు ఈ సినిమాకు తెరకెక్కించారు. కమెడియన్‌గా పలు సినిమాలు చేసిన వేణు ఈ సినిమాతోనే మెగాఫోన్ పట్టారు. కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించిన ఈ సినిమా ఇరవై రోజుల్లోనే రూ.20 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఈ ఓటీటీ రిలీజ్ విషయంపై దిల్‌రాజు స్పందించలేదు.