సినీ ప్రపంచపు అతి గొప్ప స్వప్నమైన ఆస్కార్ పురస్కార కలనసాకారం చేసుకునేందుకు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం అడుగు దూరంలో నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ సొంతం చేసుకున్న తొలి భారతీయ గీతంగా ఇప్పటికే ఖ్యాతినార్జించిన నాటు నాటు పాట ఆస్కార్‌నూ సాధించాలని కోట్లాది మంది సినీ ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ సహా ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న నాటు నాటు పాట ఆస్కార్‌లో మెరవడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. గత పదేళ్లుగా ఆస్కార్ అవార్డులు పరిశీలిస్తే.. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ చాయిస్ అవార్డులు పొందిన విజేతలే ఎక్కువగా ఆస్కార్ పురస్కారాన్ని పొందుతున్నారు.
2012లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ క్రిటిక్స్ చాయిస్ అవార్డులను గెలుచుకున్న స్కై ఫాల్ సాంగ్ ఆ ఏడాది ఆస్కార్‌ను ఒడిసిపట్టింది. 2014లోనూ ఇదే సంప్రదాయం పునరావృతమైంది. 2014లో గ్లోరీ పాటకు గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ చాయిస్ అవార్డు రాగా.. ఆస్కార్ అవార్డూ కూడా గ్లోరీ పాటకే వచ్చింది. 2015లోనూ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన రైటింగ్స్ ఆన్ ది పాటకే ఆస్కార్ లభించింది. 2016లోనూ గోల్డెన్ గ్లోబ్.. క్రిటిక్స్ చాయిస్ అవార్డు లభించిన సిటీ ఆఫ్ స్టార్స్ పాటకే ఆస్కార్ పురస్కారం లభించింది. ఇలా 2017, 2018, 2019, 2021లలో గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ చాయిస్ అవార్డులు దక్కించుకున్న పాటలే అకాడమీ ఆస్కార్ పురస్కారాన్ని కూడా దక్కించుకున్నారు. అంటే గత పదేళ్లల్లో అరు సార్లు గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు పొందిన.. పాటలనే ఆస్కార్ పురస్కారం కూడా వరించింది. గత పదేళ్ల చరిత్ర లాగ ఈ ఏడాది కూడా అదే విధానం పునారవృతమైతే నాటు నాటు ఆస్కార్ వేదికపై కూడా స్టెపులు వేయించడం పక్కా అని అభిమానులు తెగ సంబరపడి పోతున్నారు.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్‌ను సొంతం చేసుకున్న తొలి భారతీయ గీతం నాటు నాటే. ఇది వరకు ఎ.ఆర్.రెహమాన్ స్వరపరిచిన స్లమ్ డాగ్ మిలియనీర్‌లోని జై హో పాట ఉత్తమ స్కోర్ విభాగంలో ఆస్కార్ దక్కించుకుంది. కానీ అది భారతీయ నేపథ్యం ఉన్న కథే అయినా ఆ చిత్రం మాత్రం బ్రిటిష్ రూపకర్తల నిర్మాణంలో రూపుదిద్దుకుంది. అందుకే నాటు నాటు ఆస్కార్ గెలిస్తే మాత్రం తొలి భారతీయ గీతంగా చరిత్రని సృష్టిస్తుంది. లగాన్ తర్వాత నామినేషన్ దక్కించుకున్న భారత సినిమాగానూ ట్రిపుల్ ఆర్ నిలిచింది. ఇన్ని ఘనతలు సాధించిన ఆర్ఆర్ఆర్.. ఆ ఒక్క ఆస్కార్‌ను పట్టేస్తే... అది భారత సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై సగర్వంగా చాటిన రోజు అవుతందనడంలో ఎలాంటి సందేహం లేదు.