Actress Jayaprada Jail : మాజీ ఎంపీ, ప్రముఖ నటి జయప్రదకు చెన్నైలోని ఎగ్మోర్ న్యాయస్థానం.. రూ. 5000 జరిమానాతో పాటు ఆరు నెలల శిక్ష విధించింది. ఆమెతో పాటు ఈ కేసులో మరో ఇద్దరికి కూడా కోర్టు శిక్షను ఖరారు చేసింది.
ఇదీ జరిగింది..
సీనియర్ నటి జయప్రద.. రామ్‌కుమార్, రాజ్ బాబు అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి గతంలో చెన్నై అన్నాసలైలో ఓ సినిమా థియేటర్ నడిపించేవారు. కొన్ని కారణాల వల్ల ఈ థియేటర్‌ను పదేళ్ల కిందటే మూసివేశారు. అయితే థియేటర్ నిర్వహించే సమయంలో.. వారి వద్ద పనిచేసే కార్మికుల దగ్గర వీరు.. ఈఎస్ఐ కింద కొంత డబ్బు వసూల్ చేశారు. కానీ థియేటర్ మూసివేసిన తర్వాత సదరు కార్మికులకు ఆ ఈఎస్ఐ డబ్బు తిరిగి చెల్లించలేదు.
దీంతో కార్మికులంతా బీమా కంపెనీని ఆశ్రయించారు. కాగా బీమా కార్పోరేషన్ సంస్థ.. చెన్నై ఎగ్మోర్ కోర్టులో థియేటర్ యాజమాన్యంపై పిటిషన్ దాఖలు చేసింది. కార్మికుల నుంచి వసూల్ చేసిన ఈఎస్ఐ డబ్బును.. థియేటర్ యాజమాన్యం వారికి చెల్లిందలేదని కోర్టుకు వివరించింది. దీనికి వ్యతిరేకంగా జయప్రద వేసిన మూడు పిటిషన్లలను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
అయితే ఎగ్మోర్ కోర్టు న్యాయమూర్తి కేసు విచారించగా.. నటి జయప్రద, కార్మికుల నుంచి వసూల్ చేసిన డబ్బును తిరిగి ఇస్తానని చెప్పారు. కాగా బీమా కంపెనీ తరఫు లాయర్ దీనికి అంగీకరీంచలేదు. ఇక ఇరువురి వాదనలు విన్న ఎగ్మోర్ కోర్టు.. జయప్రద సహా మరో ఇద్దరికి శిక్ష విధిస్తూ.. తీర్పునిచ్చింది.
Jaya Prada Cinema Career : కాగా జయప్రద ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమలో 300+ సినిమాల్లో నటించారు. సీనియర్ నటుడు కమల్ హసన్‌తో కలిసి నటించిన 'సాగర సంగమం' సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
Jaya Prada Political Career : ఇక సినిమా తర్వాత తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. టీడీపీ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీ కూడా అయ్యారు. ప్రస్తుతం ఆమె బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు.