విలక్షణ నటుడు, అలనాటి సీనియర్ నటుడు రావు గోపాల్ రావు కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రావు రమేశ్. తండ్రికి తగ్గ తనయుడిగా తన నటనతో ప్రశంసలను అందుకున్నారు. వాస్తవానికి చిత్రపరిశ్రమలోకి కాస్త ఆలస్యంగానే ఎంట్రీ ఇచ్చినా ఆయన.. ఎన్నో చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ఏ చిత్రంలోనైనా తన మార్క్ కనిపించేలా నటించడం ఆయన ప్రత్యేకత.
'కొత్తబంగారు లోకం' చిత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు విలక్షన పాత్రలు చేస్తూ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడాయన తనలోని మరో కోణాన్ని చూపించబోతున్నారు. ఇప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ప్రతినాయకుడిగా సిల్వర్ స్క్రీన్‌పై అలరించిన ఆయన.. తొలిసారి హీరోగా మారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆయన పోషించబోయేది రెగ్యులర్ హీరో క్యారెక్టర్ కాదు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
గత కొంత కాలంగా సినీ ప్రేక్షకులు కంటెంట్ సినిమాలను ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో రాజ్‌కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి స్టార్ యాక్టర్స్ చేసే సినిమాల లాగా ఈ చిత్రం ఉండబోతుందని తెలుస్తోంది. 56 ఏళ్ల వయస్సులో రావు రమేశ్ ఈ కొత్త ప్రయోగం చేస్తుండడంతో ఆసక్తికరంగా మారింది.
ఈ చిత్రానికి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే టైటిల్ ఖరారు చేశారు. హ్యాపీ వెడ్డింగ్ ఫేమ్ లక్ష్మణ్ కార్య ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథతో రాబోతున్న ఈ మూవీలో రావు రమేశ్ మెయిన్ లీడ్ రోల్‌లో కనిపించనున్నారు. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాలు 'పుష్ప', 'కెజీయఫ్ 2', 'ధమాకా' తర్వాత ఆయన ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించనున్న చిత్రమిది. పీబీఆర్ సినిమాస్ సంస్థ ప్రొడక్షన్ నంబర్ 2గా ఈ మూవీని నిర్మిస్తోంది. మరో విశేషమేమిటంటే.. ఇందులో నటి ఇంద్రజ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.
ఇదీ చూడండి: అనిరుధ్ లైనప్.. ఎన్టీఆర్ టు కమల్‌హాసన్.. స్టార్ హీరోలందరూ మనోడి వైపే!