Acharya Ramcharan: చిరంజీవి- రామ్‌చరణ్ కలిసి నటిస్తే ఎలా ఉంటుందో 'ఆచార్య' చూపించబోతుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా చరణ్ విలేకరులతో ఆదివారం మాట్లాడారు. కొరటాల శివ వల్ల 'ఆర్ఆర్ఆర్'లో అడుగుపెట్టానని, రాజమౌళి వల్ల 'ఆచార్య'లో నటించానని చెప్పారు. ఒకేసారి రెండు చిత్రాల్లో నటించడం ఎలా అనిపించింది? 'ఆచార్య'ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయకపోవడానికి కారణమేంటి? తదితర విషయాలకు సమాధానం ఆయన మాటల్లోనే..
నా స్థానంలో నాన్న.. ''రంగస్థలం' సినిమా చేస్తున్నప్పుడే నేనూ కొరటాల శివ కలిసి పనిచేయాలనుకున్నాం. అప్పటికి కథ సిద్ధంగా లేకపోయినా ఫిక్స్ అయ్యాం. అదే సమయానికి రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' గురించి చెప్పారు. శివకు ముందే మాటివ్వడంతో ''మీ ప్రాజెక్టు పూర్తి చేసి.. రాజమౌళి దర్శకత్వంలో తర్వాత నటిస్తా'' అని ఆయనకు చెప్పా. ''కంగారేం వద్దండీ.. ఆలస్యమైనా పెద్ద సినిమా చేద్దాం. ఎన్టీఆర్‌తో కలిసి మీరు నటించడాన్ని.. ఓ సినిమా అభిమానిగా నేనూ కోరుకుంటున్నా'' అని శివ నాకు భరోసా ఇచ్చారు. ఆయనిచ్చిన కంఫర్ట్ వల్లే 'ఆర్‌ఆర్‌ఆర్' షూట్‌కి ప్రశాంతంగా వెళ్లా. కొన్నాళ్లకు.. 'శివతో సినిమా నేను చేస్తా' అని నాన్న తన మనసులో మాట బయటపెట్టారు. అలా 'ఆచార్య' మొదలైంది''
రాజమౌళినే కారణం.. ''ముందుగా ఈ ప్రాజెక్టులోకి నేను నిర్మాతగానే అడుగుపెట్టా తప్ప నటుడిగా కాదు. ఇందులోని అతిథి పాత్ర కోసం ఇతర హీరోలను సంప్రదించారు కానీ వీలుపడలేదు. దాంతో నన్ను అడిగారు. సుమారు 15 నిమిషాలే కదా చేసేద్దాం అనుకున్నా. అది కాస్తా చివరికి 40 ని.ల నిడివి ఉన్న పాత్రగా మారింది. దర్శకుడు రాజమౌళి సంగతి తెలిసిందే కదా. ఆయన సామ్రాజ్యంలోకి ఒక్కసారి ప్రవేశిస్తే పని పూర్తయ్యేదాకా బయటకు రావడం కష్టం. 'ఆచార్య'లో నేను నటించేందుకు అంగీకరిస్తారా, లేదా? అనే సందేహంతో.. విషయం చెప్పగానే ఆయన ఓకే అన్నారు. ఓ రకంగా ఆయన కారణంగానే నేనీ క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యా. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. శివ దర్శకత్వంలో నటించడం ఒకెత్తైతే.. నాన్నతో కలిసి తెరను పంచుకోవడం మరో ఎత్తు''
అంతగా కష్టపడలేదు.. ''ఇందులో మా ఇద్దరి పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. మా దారులు వేరైనా లక్ష్యం ఒకటే. నేనిందులో గురుకుల విద్యార్థి సిద్ధగా కనిపిస్తా. సోనూసూద్ నా మిత్రుడిగా నటించాడు. అటు 'ఆర్‌ఆర్‌ఆర్'లో ఇటు 'ఆచార్య'లో ఒకేసారి నటించడం అంత కష్టమనిపించలేదు. అంతా దర్శకులే చూసుకున్నారు. 'ఈ సీన్‌లో ఇలా ఉండాలి. ఆ లుక్ అలా ఉండాలి' అని పాత్రల్లోని వైవిధ్యాన్ని వారు వివరంగా చెప్పడంతో చాలా సులువుగా నటించేశా. మేమే కాదు ఈ కథలో ఏ ఇద్దరు హీరోలు నటించినా అది సూపర్ హిట్టే అవుతుంది. నేనూ నాన్న కలిశామని ఈ కథలో మార్పు చేయలేదు. ఉద్దేశపూర్వకంగా మా ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సన్నివేశాల్ని జత చేయలేదు. ప్రచార చిత్రంలో కనిపించిన పులుల షాట్ కూడా కథానుసారం తెరకెక్కించిందే''
నాన్నను కొత్తగా చూశా.. ''నిజ జీవితంలో నాన్నా నేనూ ఎక్కువగా కలిసుండలేదు. ఆయన షూటింగ్‌కి పొద్దునే వెళ్తే రాత్రికి ఇంటికి చేరుకునేవారు. 'ఆచార్య' మాకు మరిచిపోలేని జ్ఞాపకాల్ని పంచింది. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లిలో సుమారు 20 రోజులు ఉన్నాం. నిద్ర లేవడం, పడుకోవడం, భోజనం, కసరత్తులు.. ఇలా ప్రతిదీ కలిసే చేసేవాళ్లం. సెట్స్‌లో అడుగుపెట్టాక నాన్న నన్ను కొడుకుగా కాకుండా ఓ నటుడిగానే చూశారు. ఆయన నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా''
అందుకు సమయం లేదు.. ''ముందుగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదలచేయాలని అనుకోలేదు. తర్వాత, 'ఆర్‌ఆర్‌ఆర్' దృష్ట్యా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తే బాగుండనిపించింది. కానీ, డబ్బింగ్ తదితర కార్యక్రమాలకు కావాల్సిన సమయం లేకపోవడం వల్ల సాధ్యమవలేదు. మంచి కథ కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ఇతర భాషల్లోనూ విడుదల చేస్తాం. 'రంగస్థలం'లోని ఓ పాటతో పూజాహెగ్డేతో నా ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పుడు కలిసి నటించాం. ఆమె ఎంతో అద్భుతమైన, బిజీ నటి. ఏ సినిమాలో చూసినా తనే కనిపిస్తుంది'' (నవ్వుతూ..).
బాధ్యత పెరిగింది.. ''మన తెలుగు సినిమాలకు ఇంత పేరు వస్తుండటం చాలా గర్వంగా ఉంది. నాన్న చెప్పినట్టు ఒకప్పుడు దక్షిణాది చిత్రాలంటే ఉత్తరాది వారికి చిన్నచూపు ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. 'ఆర్‌ఆర్‌ఆర్' విజయంతో నా బాధ్యత పెరిగింది. సినిమాల సంఖ్య తక్కువైనా ఫర్వాలేదు, మంచి కథలు ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం.. శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నా. చిత్రీకరణ వేగంగా సాగుతోంది. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఓ చిత్రం చేయబోతున్నా'' అని రామ్‌చరణ్ పంచుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: బాలయ్య- బోయపాటి కొత్త చిత్రం.. ఆ కండిషన్ పెట్టిన నటసింహం!
దేశంలో అతిపెద్ద సినిమా సెట్.. 'ధర్మస్థలి'ని తీర్చిదిద్దారిలా..