Oscars 2022: లాస్ ఏంజెల్స్: ప్రతిష్ఠాత్మక సినీ వేడుక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రముఖ నటుడు విల్ స్మిత్.. వ్యాఖ్యాత క్రిస్ రాక్‌పై చేయి చేసుకోవడంతో ప్రపంచం నివ్వెరపోయింది. నటుడి ప్రవర్తన పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేస్తూ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఏఎంపీఏఎస్) కమెడియన్‌కు క్షమాపణలు చెప్పింది. 'మిస్టర్ రాక్.. ఆస్కార్ వేదికపై మీకు జరిగినదాని పట్ల మేము క్షమాపణలు కోరుతున్నాము. ఆ సమయంలో మీరు చూపిన సహనానికి ధన్యవాదాలు' అని ఏఎంపీఏఎస్ పేర్కొన్నట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌టీ తెలిపింది.
ఈ ఘటనపై అకాడమీ రెండు రోజుల క్రితమే స్పందించింది. ఏఎంపీఏఎస్ అధ్యక్షుడు డేవిడ్ రూబిన్ అకాడమీ సభ్యులకు ఓ లేఖ పంపారు. ఈ ఘటనపై అకాడమీ తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 'తాజాగా 94వ ఆస్కార్ వేడుకలు నిర్వహించాం. కానీ ఇలాంటి వేదికపై ఓ నామినీ ఆమోదయోగ్యంకాని, హానికరమైన ప్రవర్తనతో మేము కలత చెందాము. విల్ స్మిత్ చర్యను ఖండిస్తున్నాం. ఆయన హద్దు మీరారు. నియమ నిబంధనల్లో భాగంగా.. అకాడమీ గవర్నర్ల బోర్డు విల్ స్మిత్‌పై తగిన చర్యలు తీసుకోవాలి. దాడి చేయటాన్ని సహించేది లేదు' అని లేఖలో తెలిపారు.
అరెస్టుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు: చెంపదెబ్బ ఘటనపై అకాడమీ గవర్నర్ల బోర్డు బుధవారం సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. క్రిస్ రాక్‌పై చేయి చేసుకున్నందుకు గానూ స్మిత్‌పై చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించింది. ఇదిలా ఉంటే.. విల్ స్మిత్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు ఆస్కార్ ప్రొడ్యూసర్ విల్ పెక్కెర్ వెల్లడించారు. ‘స్మిత్ అరెస్టు సిద్ధమవుతున్నట్లు పోలీసులు చెప్పారు. 'ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకోవచ్చు. దాడులను ప్రేరేపించలేం' అని పెక్కెర్ పేర్కొన్నారు.