ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సమాచారం ఇస్తే రివార్డు అందిస్తామని సీబీఐ ప్రకటించింది. కచ్చితమైన, నమ్మదగిన సమాచారం అందిస్తే రూ.5 లక్షల నగదు బహుమతి అందిస్తామని తెలిపింది. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేసింది. ఫోన్ నంబర్లలో లేదా కార్యాలయంలో సంప్రదించవచ్చని సీబీఐ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి 76 రోజులుగా సీబీఐ విచారణ జరుపుతోంది. దీనికి సంబంధించి అనేక మందిని ఇప్పటికే ప్రశ్నించారు సీబీఐ అధికారులు. వివేకా హత్య జరిగిన తర్వాత వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు దాదాపు 20 మంది ఘటనాస్థలంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వివేకా కుమార్తె సునీత ఏపీ హైకోర్టుకు సమర్పించిన 15 మంది అనుమానితుల జాబితాలో ఉన్న వారిని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత కొద్ది రోజులుగా పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో, కడప జైలు అతిథి గృహంలో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. పలువురిని ప్రశ్నించారు.
దాదాపు ఏడాది నుంచి ఈ కేసుపై విచారణ చేస్తున్న సీబీఐ అనేక మంది అనుమానితులను ఇప్పటికే పలు దఫాలు ప్రశ్నించింది. మూడు నెలల కిందట నాలుగో దఫా విచారణ చేపట్టిన సీబీఐ.. వరుసగా 75 రోజుల పాటు విచారణ చేసింది. ఈ హత్య కేసులో స్పష్టమైన ఆధారాలు సేకరించాల్సి ఉన్నందున.. నమ్మకమైన సమాచారం ఎవరి దగ్గరైనా ఉంటే దాన్ని సేకరించేందుకు సీబీఐ ఈ ప్రకటన ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: Viveka Murder Case: సునీల్ యాదవ్కు నార్కో పరీక్షలపై కోర్టులో వాదనలు