Sister plan for Brother's murder: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో దిన్నెదేవరపాడుకు చెందిన మాధవస్వామి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం తల్లి, అతని చెల్లెలే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో కర్నూలు తాలుకా సీఐ శేషయ్యతో కలిసి కర్నూలు డీఎస్పీ కె.వి.మహేశ్ కేసు వివరాలను వెల్లడించారు. మాధవస్వామికి గ్రామంలో పెద్దల ద్వారా సంక్రమించిన రూ.60 లక్షల విలువ చేసే 30 సెంట్ల స్థలం ఉంది. దీనిని అమ్మేందుకు తల్లి ఎల్లమ్మ, చెల్లెలు నిర్మలమ్మ ప్రయత్నిస్తుండగా.. మాధవస్వామి ఒప్పుకోలేదు. దీంతో వారు అతనిపై కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పక్కా ప్రణాళిక రూపొందించారు. మాధవస్వామిని చంపేందుకు నిర్మలమ్మ తన ప్రియుడు లక్ష్మన్నతో ఒప్పందం చేసుకున్నారు. హత్యకు ముందు రూ.10 వేలు ఇచ్చేలా.. పని పూర్తయ్యాక 3 సెంట్ల స్థలం లేదా స్థలానికి తగ్గ డబ్బులు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు.
ఈ క్రమంలో ఈ నెల 13న రాత్రి మద్యం తాగేందుకు మాధవస్వామిని లక్ష్మన్న తీసుకెళ్లాడు. అక్కడ ఒక్కసారిగా మాధవస్వామిపై దాడి చేసి.. గొంతు కోసి చంపేశాడు. నిర్మలమ్మ, లక్ష్మన్న సంభాషణలు ఉన్న వాయిస్ రికార్డు, హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలతో ఉన్న నిందితుడి దుస్తులు, మోటారు సైకిల్ తదితరాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి..: