Suicide Attempt in Police Station: పెళ్లి చేసుకుంటానని చెప్పింది బావే కదా అని నమ్మి.. నాలుగేళ్లుగా అతనితో ప్రేమలో ఉన్న ఓ యువతికి నిరాశే ఎదురైంది. మోసపోయానని వాపోతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే.. పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో చివరికి పురుగుల మందే దిక్కయింది. మోసం చేసిన ప్రియుడిపై కేసు నమోదు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బాధితురాలు.. పీఎస్‌లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. నిజామాబాద్ జిల్లా నవీపేట్ పోలీస్ స్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బోధన్‌కు చెందిన మేనమామ కుమారుడు ప్రేమ్... పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఇప్పుడేమో పెళ్లి సంగతి మాట్లాడేసరికి నిరాకరించడంతో ఇరవై రోజుల క్రితం తన తండ్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని చెప్పింది. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఫలితం లేకపోవడంతో... యువతి బలవన్మరణానికి యత్నించినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై నవీపేట్ ఎస్సై రాజారెడ్డిని వివరణ అడగ్గా.. వారు అబ్బాయికి, అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్పారని పేర్కొన్నారు. కానీ కేసు నమోదు చేయమని చెప్పలేదని తెలిపారు.
ఇదీ చదవండి: Live Video: రోడ్డు దాటుతుండగా దూసుకొచ్చిన మృత్యువు..