కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చి మహిళా సర్పంచ్ మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది. దామరగిద్ద ఆరోగ్య కేంద్రంలో ఇవాళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. ఆపరేషన్ చేయించుకునేందుకు లింగారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ లక్ష్మీ వచ్చారు. ఆమెకు శస్త్ర చికిత్స ప్రారంభిస్తుండగా ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయని వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో ఆమెను నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు జిల్లా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించడం వల్లే సర్పంచ్ మృతి చెందారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని వీరసావర్కర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. దామరగిద్ద పీహెచ్‌సీలో 143 మందికి శస్త్ర చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. సర్పంచ్ లక్ష్మీని నారాయణపేట ఆస్పత్రికి తరలించిన తర్వాత 40మందికి ఆపరేషన్లు నిర్వహించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: శుభకార్యానికి వెళ్లొస్తూ వాగులోకి దూసుకెళ్లిన కారు