ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన దివ్య మూడేళ్ల క్రితం తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో సంగీతం కోర్సు పూర్తి చేసింది. ఆ సమయంలో అదే కళాశాలలో చదువుతున్న అహమ్మద్ తౌసీఫ్ దివ్యకు పరిచమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఎదిరించి తౌసీఫ్ను వివాహం చేసుకుంది. ఈ ఘటనపై దివ్య కుటుంబీకులు గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. తమ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నట్లు దివ్య, తౌసీఫ్ చెప్పారు. దీంతో పోలీసులు కేసు కొట్టివేశారు.
అనంతరం దివ్య తౌసీఫ్తో కలిసి హైదరాబాద్ వెళ్లింది. అక్కడ వారం రోజులు ఉన్న తర్వాత తన తండ్రికి ఆరోగ్యం బాగా లేదని తౌసీఫ్ గుంతకల్లు వెళ్లాడు. కొద్దిరోజుల తర్వాత దివ్యనూ గుంతకల్లు తీసుకువెళ్లాడు. ఇంటికి వెళ్లిన అనంతరం దివ్యను ఇస్లాం మతంలోకి మారాలంటూ కుటుంబంసభ్యులతో కలిసి వేధింపులకు గురిచేశాడు.
అప్పుడలా.. ఇప్పుడిలా..
ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి.. సంతోషంగా చూసుకుంటాడు అనుకుంటే, శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని దివ్య ఆవేదన వ్యక్తం చేసింది. తనను వేధింపులకు గురి చేసిన తౌసీఫ్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. హిందూ సంఘాల నేతలు, సినీ నటి కరాటే కళ్యాణి బాధితురాలికి అండగా నిలిచారు.