రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో విచారణ ముమ్మరం చేశారు. హత్యకు ఉపయోగించిన కొడవళ్ల స్వాధీనానికి పోలీసులు యత్నాలు మొదలుపెట్టారు. ఉదయం కుంట శ్రీను, మరొకరిని పెద్దపల్లి జిల్లా పార్వతీ బ్యారేజీ వద్దకు తీసుకెళ్లిన పోలీసులు... వారు 58-60 పిల్లర్ల మధ్య కొడవళ్లను పడేసినట్లు తెలుసుకున్నారు.
ఏపీలోని విశాఖ నుంచి వచ్చిన గజ ఈతగాళ్లతో ఆయుధాల కోసం నాలుగు గంటల పాటు గాలించారు. బ్యారేజీలోని 58-60 పిల్లర్ల వద్ద ఈ గాలింపు జరిగింది. అక్కడ నీరు 10 నుంచి 15 మీటర్ల లోతు వరకు ఉండటంతో.. గజ ఈతగాళ్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి. చీకటి పడటంతో హత్యకు కొడవళ్ల గాలింపు ఈరోజుకి వాయిదా వేశారు.
ఈ కేసులో ముగ్గురు నిందితులు మూడు రోజులుగా కస్టడీలో ఉన్నారు. తాజాగా నాలుగో నిందితుడు బిట్టు శ్రీనును కూడా మంథని కోర్టు కస్టడీకి ఇచ్చింది. హత్యకు సంబంధించిన కారణాలు... దాని వెనక ఉన్నవారి వివరాలు రాబట్టేందుకు నిందితులను పోలీసులు అన్ని విధాలా విచారిస్తున్నారు.