తెలిసి తెలియనీ వయసులో ప్రేమ అఘాయిత్యానికి దారితీసింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో యువకుడు మృతిచెందగా.. యువతి (20) ప్రాణాలతో బయటపడింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో చోటు చేసుకుంది.
జూబ్లీహిల్స్ పోలీసుల వివరాల ప్రకారం..
నగరంలోని యూసుఫ్‌గూడకు చెందిన ఓ పోలీస్ అధికారి కుమారుడు ఇంటర్ చదువుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన సినీ పరిశ్రమలో పనిచేసే ఓ యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి సహజీవనానికి దారితీసింది. ఈ క్రమంలోనే వారిద్దరు వివాహం కూడా చేసుకున్నారు. అయితే వారి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో వారిలో మనస్పర్ధలు వచ్చి గొడవపడ్డారు.
శనివారం తెల్లవారుజామున ఇద్దరు ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అదే సమయంలో యువతి చున్నీ ఊడిపోవడంతో ఒక్కసారిగా ఆమె కిందపడిపోయింది. యువతి వెంటనే బయటకు వెళ్లి చుట్టుపక్కల వారిని తీసుకువచ్చే లోపే అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.