Inter students suicide: ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయామని రెండు రోజుల క్రితం ఏడుగురు ఆత్మహత్య చేసుకోగా.. మరో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు బుధవారం బలవన్మరణాలకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ విద్యార్థి (17) ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో 5 సబ్జెక్టులు తప్పిన భయంతో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ‘పరీక్షల్లో ఫెయిల్ అయిన భయంతోనే ఆత్మహత్య చేసుకొన్నట్లు తమ విచారణలో తేలిందని’ ఎస్సై తెలిపారు. హైదరాబాద్ న్యూ మలక్‌పేట ప్రాంతానికి చెందిన విద్యార్థిని (19) ఇంటర్‌లో పాస్‌కాకపోవడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక మంగళవారం రాత్రి తన గదిలో ఉరి వేసుకుని మృతి చెందింది.
మంగళవారం వివిధ ప్రాంతాల్లో మొత్తం ఎనిమిదిమంది చనిపోగా ఇందులో హైదరాబాద్ నగరానికి చెందిన నలుగురు విద్యార్థులు, పూర్వ ఖమ్మం జిల్లాకు చెందిన వారు ముగ్గురు, జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కొత్తపల్లికి చెందిన విద్యార్థిని ఒకరు ఉన్నారు. ఉత్తీర్ణత సాధించలేకపోయామని ముగ్గురు, తక్కువ మార్కులు వచ్చాయని ఒకరు నగరంలో తనువు చాలించారు.
తొందరపాటు చర్యలకు పాల్పడవద్దు.. ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని విద్యార్థులు ఎవరూ తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ఏడాది నష్టపోకుండా ఉండేందుకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా దందా..