ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం శివనగర్‌లో ఆదివారం రాత్రి వెలుగుచూసిన అక్కాచెల్లెళ్ల జంట హత్యల కేసు.. మరునాడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతులు పాతికేళ్ల కిందట శివనగర్‌లో మూడంతస్తుల ఇల్లు కట్టుకున్నారు. అందులో వీరి ఒక్క కుటుంబమే నివసిస్తోంది. తల్లిదండ్రులు, పిల్లలు అలేఖ్య (27), సాయిదివ్య (22) ఇంట్లో తరచూ ఆధ్యాత్మిక విషయాలే చర్చించుకునేవారు. తలనొప్పి వచ్చి తగ్గిపోయినా అది బాబా దయవల్లేనని భావించేవారు. రోజంతా ఉపవాసం ఉన్నా.. ఆకలి లేకపోవడానికి బాబా ఆశీస్సులే కారణమనేవారు. పద్మజ ఫేస్‌బుక్ నిండా ఆధ్యాత్మిక పోస్టులే ఉన్నాయి. పురుషోత్తం తరచూ ఆధ్యాత్మిక, తాంత్రిక విషయాలున్న పుస్తకాలే చదివేవారు. వారం క్రితం అలేఖ్య, సాయిదివ్య పెంపుడు కుక్కను వాకింగ్ తీసుకెళ్తూ మూడు రోడ్లు కూడలిలో వేసిన ముగ్గులో ఉంచిన నిమ్మకాయలు, పసుపు, కుంకుమ తొక్కారు. ఈ విషయం తిరిగి వచ్చాక తల్లిదండ్రులకు చెప్పారు. తమకు ఏమైనా అవుతుందేమోనని యువతులిద్దరికీ భయం పట్టుకుంది. నాటి నుంచి ఆదివారం వరకూ అలేఖ్య పూర్తిగా మౌనంగా ఉంటోంది. ఇంట్లో దెయ్యాలున్నాయని సాయిదివ్య తల్లిదండ్రులకు చెప్పేది. మూత్రశాలకు వెళ్లాలన్నా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. తమను ఇంట్లోంచి తీసుకెళ్లాలని ఓ అధ్యాపకుడిని కోరగా.. ఆయన సర్దిచెప్పి వచ్చారు. ఆ తర్వాత తమిళనాడుకు చెందిన ఓ మంత్రగాడిని సంప్రదించి తాయిత్తు వేయించుకున్నారు. వారం రోజులుగా పురుషోత్తంనాయుడు, పద్మజ విధులకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు.
రోజంతా పూజలు.. అంతలోనే హత్యలు
ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో పూజలు చేస్తుండగా.. పై అంతస్తులో ఉన్న సాయిదివ్య మ్యూజిక్ వాయిస్తూ ఉన్నట్టుండి కేకలేసింది. మానసిక రోగిలా ప్రవర్తించింది. తల్లిదండ్రులు, సోదరి ముగ్గురూ కలసి ఆమెను దయ్యం ఆవహించిందని డంబెల్‌తో గట్టిగా కొట్టారు. వెంటనే ఆమె ప్రాణాలు విడిచింది. వారం తర్వాత నోరు విప్పిన అలేఖ్య.. మృతదేహం నుదుటిపై ముగ్గులు వేసి చెల్లెలి ఆత్మ బయటకు వెళ్లకుండా బంధించానంటూ చెప్పింది. ఆమెను బతికించుకొని తెచ్చేందుకు తననూ చంపాలని తల్లిని కోరింది. ముగ్గురూ నగ్నంగా ఇంట్లో పూజలు చేశారు. అలేఖ్యను పూజగదిలోకి తీసుకెళ్లి నోట్లో చిన్న రాగి కలశాన్ని పెట్టి, అందులో నవధాన్యాలు పోసి.. తలపై డంబెల్‌తో గట్టిగా కొట్టారు. ఆమె కూడా చనిపోయింది. తర్వాత వారి స్మార్ట్‌ఫోన్లను పగలగొట్టారు. సాయంత్రం 4.30 గంటలకు ఈ దారుణం జరగ్గా.. 7 గంటలకు పురుషోత్తం తన సహచర అధ్యాపకుడికి ఈ విషయం చెప్పాడు. ఆయన వచ్చి చూడగా.. రెండు మృతదేహాలు రక్తపు మడుగులో శవాలుగా పడి ఉండగా.. తల్లిదండ్రులు క్షుద్రపూజల్లో నిమగ్నయ్యారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరచారి, పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాల తరలింపునకు తల్లి పద్మజ అడ్డుపడింది. ‘నేనే పార్వతిని.. కాళికను. బిడ్డలిద్దరూ పుణ్యలోకాల్లో ఉన్నారు. సోమవారం ఉదయాన్నే బయటకు తీసుకొస్తానంటూ అరిచింది. పోలీసులు వారిని కట్టడి చేసి.. అర్ధరాత్రి తర్వాత శవాలను మార్చురీకి తరలించారు. మధ్యాహ్నం పోస్టుమార్టం తర్వాత మృతదేహాలకు పెద్దతోపులో అంత్యక్రియలు పూర్తిచేశారు. తలకొరివి పెట్టేందుకు తండ్రిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు. నిందితులను వారి ఇంటిలోనే విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: మదనపల్లెలో అక్కచెల్లెళ్ల హత్యకేసులో విస్తుపోయే వాస్తవాలు