నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బోదేపల్లిలో గురువారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఊరు చెరువులో నీటమునిగి మేనబావ, బావమరిది మృతి చెందారు. బోదేపల్లికి చెందిన శ్రావణ్ (24) ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. జూన్ 27 అతని సోదరుడి వివాహం ఉండటంతో ఇండియాకు వచ్చాడు. అందరితో కలిసి సోదరుడి పెళ్లి దగ్గరుండి జరిపించాడు. మరో నెల రోజుల్లో తిరిగి దుబాయి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.
గురువారం సాయంత్రం శ్రావణ్ అతని మేన బావమరిది తరణ్(16) బయటకు వెళ్లారు. బయట కాసేపు కాలక్షేపం చేసి కాల కృత్యాలు తీర్చుకోవడానికి చెరువు గట్టుకు వెళ్లారు. తరుణ్ చెరువు నీటిలో దిగగా లోతు ఎక్కువగా ఉండటంతో నీట మునిగాడు. ఒడ్డున ఉన్న శ్రావణ్ గమనించి తరుణ్‌ను రక్షించడానికి నీటిలోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండటంతో తరుణ్‌తో పాటు శ్రావణ్ నీట మునిగాడు. బయటకు వెళ్లిన వారు తిరిగి రాకపోవటంతో కుటుంబ సభ్యులు వెతికారు. చెరువులో మునిగినట్లు తెలుసుకుని అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను బయటకు తీయించారు. మృతదేహాలను శవ పరీక్షల కోసం బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: భారత్‌కు కోట్ల రూపాయలు పంపిన నీరవ్ సోదరి