Child Died at Niloufer Hospital: హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులు చనిపోయారన్న వార్తల్లో వాస్తవం లేదని ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీ కృష్ణ స్పష్టం చేశారు. చనిపోయింది ఒక చిన్నారి మాత్రమేనని... ఇద్దరు కాదని పేర్కొన్నారు. గత నెల 28న చిన్నారిని నాగర్ కర్నూల్ నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చారని ఆయన తెలిపారు. 7వ నెలలో ఒక కేజీ బరువుతో ఆ పసికందు పుట్టిందని చెప్పారు. ఇవాళ తెల్లవారుజామున 6 గంటల సమయంలో శిశువు మృతి చెందిందని పేర్కొన్నారు.
ఆ వ్యాధితోనే
చిన్నారి రెస్ప్రక్టువ్ దిస్ప్రిస్ అనే వ్యాధితో బాధపడుతోందని.. ఆ వ్యాధి ఉన్న పిల్లలకు లోపల అవయవాల ఎదుగుదల ఉండదని సూపరింటెండెంట్ మురళీ కృష్ణ వివరించారు. శిశువును ఆస్పత్రికి తీసుకుని వచ్చినప్పటి నుంచి ఆక్సిజన్ మీద ఉంచామని పేర్కొన్నారు. చిన్నారి విషమంగా ఉన్నప్పుడే ఆస్పత్రి తీసుకువచ్చారన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
"ఏడో నెలలో పుట్టిన పాప.. కేజీ బరువుతో పుట్టింది. అలాంటి పిల్లల అవయవాల్లో ఎదుగుదల ఉండదు. పాప ఆరోగ్యం విషమంగా ఉన్నప్పుడే ఆస్పత్రికి తీసుకువచ్చారు. మా ప్రయత్నం మేము చేశాం. చిన్నారి మృతి చెందిందన్న ఆవేదనలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాప చనిపోవడంలో మా తప్పేమీ లేదు." -మురళీ కృష్ణ, నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్
ఇద్దరు మృతి చెందినట్లు
కాగా నిలోఫర్ ఆస్పత్రిలో ఉదయం ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు ముందుగా వార్తలు వచ్చాయి. అస్వస్థతతో ఆస్పత్రికి వచ్చిన పిల్లలకు.. నర్సు ఏవో ఇంజక్షన్లు ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. కాగా ఇంజక్షన్లు ఇచ్చిన కాసేపటికే తమ పిల్లలు చనిపోయారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఆస్పత్రి బయట ఆందోళన చేపట్టారు. దీన్ని ఖండించిన నిలోఫర్ సూపరింటెండెంట్.. చనిపోయిందని ఒక పాప మాత్రమేనని.. చిన్నారి మృతిలో తమ తప్పిదమేమీలేదని మీడియాకు వివరించారు.
ఇదీ చదవండి: Rape on Woman: రెండు రోజుల పరిచయం.. మూడో రోజు అత్యాచారం