గర్భం దాల్చిందనే విషయం తెలిసి పుట్టింటి, అత్తింటి వారు ఎంతో సంతోషించారు. ఆమెకు ఏ కష్టం రావద్దంటూ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. నెలలు నిండే కొద్ది వారిలో ఆనందం ఎక్కువ అయింది. స్కానింగ్ చేసిన డాక్టర్ కడుపులో కవలలు ఉన్నారని చెప్పేసరికి వారి ఆనందం మరింత రెట్టింపు అయింది. ఆమెను మరింత జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెట్టారు. కానీ విధికి మాత్రం వారి సంతోషాన్ని చూసి కన్ను కుట్టింది. గర్భిణీకి వెన్నునొప్పి రావడంతో... కుటంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే వారికి కోలుకోలేని దెబ్బ తగలింది.
వరంగల్ జిల్లా కాశీబుగ్గకు చెందిన వాణి గర్భిణి. ఆదివారం రాత్రి వెన్ను నొప్పితో గంగా ఆస్పత్రిలో చేరింది. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించగా.. గర్భిణికి ఒక్కసారిగా రక్తస్రావం కావడం మొదలైంది. మెరుగైన వైద్యం కోసం గంగా ఆస్పత్రి వైద్యులు... ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించాలని వాణి బంధువులకు సూచించారు.
అప్పటికే రక్తస్రావం తీవ్రం కావడంతో ఇద్దరు కవల పిల్లలు కడుపులోనే గంగా ఆస్పత్రిలో... (Fetus Died in Womb) మృతి చెందారు. దీంతో కోపోద్రిక్తులైన వాణి బంధువులు వైద్యులను నిలదీశారు. సరైన వైద్యం అందించడంలో విఫలమయ్యారని రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. ఈ ఘటనతో వరంగల్, హనుమకొండ-నర్సంపేట రహదారిపై పెద్ద సంఖ్యంలో వాహనాలు నిలిచాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితురాలి బంధువులకు నచ్చజెప్పగా... వాళ్లు ఆందోళనను విరమించుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: గణేశ్ శోభాయాత్రలో కత్తులతో దాడి
వైద్యం పేరుతో శిశువు నాబిని కొరికేశాడు.. బాబు చనిపోయాడు!