మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో తెరాస శ్రేణులు.. భాజపా నాయకులపై కర్రలతో దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు భాజపా నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ రహదారి విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ గొడవలో గాయపడిన మూడుచింతలపల్లి భాజపా మండల అధ్యక్షుడు నందాల శ్రీనివాస్, వెంకటేష్ నాయక్, సుధాకర్ నాయక్‌ను చికిత్స కోసం 108లో ఆస్పత్రికి తరలించారు. వీరిలో సుధాకర్ నాయక్ పరిస్థితి విషమంగా ఉంది.
రహదారి సమస్యే గొడవకు కారణం
రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి కల్వర్టు దగ్గర మట్టి కొట్టుకుపోవడంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతూ భాజపా నాయకులు ధర్నా చేపట్టడం జరిగింది. రహదారి సమస్యపై మాట్లాడదామని పిలిచి తెరాస నాయకులు దాడి చేశారని మూడు చింతలపల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ నాయక్, కార్యవర్గ సభ్యుడు సుధాకర్‌కు గాయాలయ్యాయని తెలిపారు. తెరాస నాయకుడు మల్లేశ్ గౌడ్ తన కార్యకర్తలతో కలిసి గుండాల్లా ప్రవర్తిస్తున్నారని భాజపా నాయకులు ఆరోపించారు. ఈ సంఘటనపై ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
ఇదీ చూడండి: పండుగ పూట విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు మృతి