Tracker killed in an Elephant attack in Manyam : ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల దాడిలో లక్ష్మీనారాయణ అనే ట్రాకర్ ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రాత్రి వేళ పసుకిడి గ్రామ సమీపంలో జరిగింది ఈ ఘటన. సోమవారం సాయంత్రం పసుపుడి గ్రామానికి సమీపంలోనికి ఏనుగులు గుంపు వస్తోందని ట్రాకర్ల బృందం సమాచారం అందుకుంది. సమాచారం రావటంతో ట్రాకర్ల బృందం అక్కడికి చేరుకుంది. ఏనుగుల గుంపును గ్రామం నుంచి దూరంగా తరిమి కొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఏనుగుల గుంపు ట్రాకర్ల బృందం వైపు దూసుకొచ్చింది. ఏనుగులు దూసుకురావటం గమనించిన ట్రాకర్లు ఏనుగుల నుంచి తప్పించుకునేందకు పరుగులు తీశారు.
ఆ ప్రాంతంలో పత్తి పంటలు ఉండటంతో పరుగెత్తటం ట్రాకర్లకు కష్టమైంది. పత్తి మొక్కలు వారికి కాళ్లకు అడ్డు తగిలాయి. పత్తి చేనులో లక్ష్మీనారాయణ వేగంగా పరుగెత్తలేక కింద పడిపోయారు. వెంటనే అతనిని ఏనుగుల గుంపులోని ఓ ఏనుగు తొక్కింది. దీంతో అక్కడికక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ రేంజ్ అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఏనుగుల సంచారంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
మృతుడు లక్ష్మీనారాయణది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సవర తిడ్డిమి గ్రామం. ఇతను అటవీ శాఖలో పొరుగు సేవల ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడనుకున్న కుమారుడు మరణించటంతో అతని తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు.
ఇవీ చదవండి :