ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుకు ఆనుకుని ఉన్న మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా ఝరి తాలూకా పివర్ డోల్ గ్రామానికి చెందిన యువకుడిని పులి(Tiger) హతమార్చిన ఘటన కలకలం రేపింది. అవినాష్ అనే యువకుడు శుక్రవారం రాత్రి గ్రామ శివారులో బహిర్భూమికి వెళ్లాడు. ఎంతకీ ఇంటికి రాకపోవటంతో ఆందోళన చెందిన కుటుంబీకులు రాత్రిపూట గాలింపు చర్యలు చేపట్టారు. వేకువజామున ఒక చోట సెల్‌ఫోన్, చెప్పులు, రక్తపు మరకలు కనిపించడంతో భీతిల్లారు.
కొద్ది దూరంలో ఉన్న పొదల్లో పులి కనిపించడంతో గ్రామస్థులు కేకలు పెట్టారు. భయపడిన పులి యువకుడి మృతదేహంవదిలి వెళ్లిపోయింది. పోలీసులు, అటవీ సిబ్బంది వచ్చాక ఘటనా స్థలికి వెళ్లారు. గ్రామం తిప్పేశ్వర్ అభయారణ్యానికి దగ్గరగా ఉండటంతో అక్కడి నుంచి పులులు వస్తున్నాయని, పరిసర ప్రాంతాల ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని స్థానికులు అధికారులను నిలదీశారు. పులి వెళ్లిపోతున్న దృశ్యాలను స్థానిక యువకులు చరవాణుల్లో బంధించారు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి.
ఇదీ చదవండి: ETALA RAJENDER: హుజూరాబాద్‌లో ఈటల పాదయాత్ర