ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మహిళా నక్సల్స్ మృతి చెందారు. దంతెవాడ జిల్లా అడ్వాల్, కుంజెరాస్ అటవీప్రాంతంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. నక్సల్స్ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన మహిళా నక్సల్స్‌పై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉంది. ఘటనా స్థలంలో ఆయుధాలు, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు లొంగుబాటు..
ఇదిలా ఉంటే.. అంతకు ముందు దంతెవాడలో పెద్దఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా 2017లో సురేందర్గఢ్లోని భద్రతా సిబ్బందిపై దాడి ఘటనలో నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. అప్పటి ఘటనలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. '14 మంది మావోయిస్టులు లొంగిపోయారని.. వీరిలో కీలక సభ్యుడైన సన్నా మార్కం (21) ఉన్నాడని' దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. ఇతనిపై లక్ష రూపాయల రివార్డు సైతం ఉందన్నారు. సుక్మా జిల్లా బుర్కపల్లో 2017లో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై జరిగిన ఆకస్మిక దాడిలో మార్కం పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇతర మిలీషియా సభ్యులు సైతం అడవుల్లో చురుకుగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. రోడ్ల ధ్వంసం, పేలుడు పదార్థాలు అమర్చడం, మావోయిస్టు బ్యానర్లు, పోస్టర్లు పంచిపెడుతుంటారని ఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం తరఫున పునరావాసం కల్పిస్తామని పోలీసు అధికారులు హామీఇచ్చారు.
సంబంధిత కథనం..