రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లారీ ప్రమాద ఘటనకు కారణమైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గిరి, హోంగార్డు సంగమేశ్వర్, స్నేహితుడు మల్లేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నేడు వీరిని జైలుకు తరలించనున్నారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో హోంగార్డ్ సంగమేశ్వర్‌కు 150, మల్లేశ్‌కు 103 రీడింగ్ నమోదైంది. కారు నడిపిన గిరి రక్తనమూనాలను పోలీసులు పరీక్షకు పంపారు.
శంషాబాద్ వద్ద ఆదివారం వేగంగా వచ్చిన కారు ఇటుక లారీ కిందకు దూసుకెళ్లడంతో బోల్తా పడింది. దీంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు కార్మికులు మృతి చెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలొదిలారు. సోమవారం మరో వ్యక్తి మరణించాడు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. మరో 19 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులంతా ఒడిశాకు చెందిన కార్మికులు అని పోలీసులు తెలిపారు.