జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురంలో కల్లు తాగిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడటం జిల్లాలో కలకలం రేపింది. జల్లాపూర్ గ్రామానికి చెందిన సిద్ధయ్య, వెంకట్రాముడు, వెంకన్న ఈ నెల 7న గ్రామంలోని కల్లు దుకాణంలో కల్లు సేవించారు. అదే రోజు ఉదయం వెంకన్న, రాత్రి వెంకట్రాముడు, సిద్ధయ్య ప్రాణాలు కోల్పోయారు. దీంతో కల్తీ కల్లు తాగడం వల్లే ముగ్గురు చనిపోయారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
విషయం తెలుసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ నెల 8న కల్లు నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. ఘటనపై బాధిత కుటుంబసభ్యులెవరూ పోలీసులకు గానీ, ఎక్సైజ్ శాఖ అధికారులకు గానీ ఫిర్యాదు ఇవ్వకపోవడం వల్ల ఘటన వెలుగులోకి రాలేదు. ఇవాళ ఉదయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో జరిగిన ఘటనపై అధికారులు నిజానిజాలు ఆరా తీస్తున్నారు. కల్తీకల్లు తాగడం వల్లే తమ భర్త చనిపోయాడని మృతుడు వెంకన్న భార్య ఆరోపిస్తున్నారు. వెంకట్రాముడు భార్య సైతం అదే అనుమానం వ్యక్తం చేశారు.
పూర్తి స్థాయి విచారణ
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై గద్వాల ఆర్డీవో రాములు, డీఎస్పీ యాదగిరి గ్రామంలో విచారణ జరిపారు. మృతుల కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి.. తదుపరి పూర్తి స్థాయి విచారణ జరుపుతామని డీఎస్పీ యాదగిరి తెలిపారు.
కల్తీ ఉందని తేలితే చర్యలు తప్పవు..
ఈ నెల 8న జరిపిన ప్రాథమిక విచారణలో కల్లులో ఎలాంటి కల్తీ ఆనవాళ్లు గుర్తించలేదని ఎక్సైజ్ సీఐ తెలిపారు. అయినా నమూనాలను సేకరించి కోర్టు ద్వారా ప్రయోగశాలకు పంపామని చెప్పారు. పంపిన నమూనాలో ఏదైనా కల్తీ ఉందని తేలితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధి సొంత గ్రామం కావడంతో వారే ఘటన బయటకు రాకుండా చేశారన్న ఆరోపణలు సైతం సామాజిక మాధ్యమాల్లో గుప్పుమంటున్నాయి. మృతులు కల్తీ కల్లు తాగడం వల్లే చనిపోయారా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది అధికారుల సమగ్ర విచారణ అనంతరమే తేలనుంది.
ఇదీ చూడండి: ప్రేమించి మోసపోయింది.. పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది