Mobile snatching: ఇంటర్ విద్యార్థులు చరవాణి చోరులుగా మారారు. ద్విచక్రవాహనంపై నగరంలో యథేచ్ఛగా తిరుగుతూ చరవాణిలను తస్కరిస్తూ.. పరారవుతున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా ముగ్గురు నిందితులను గుర్తించారు. ద్విచక్రవాహన టైర్ల ఆధారంగా.. నిర్ధరించి అదుపులోకి తీసుకున్నారు.

సోమవారం రోజు(జనవరి 24న) లంగర్‌హౌజ్, గోల్కొండ, ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై తిరుగుతూ.. రోడ్డుపై నడిచి వెళ్తున్న వారి నుంచి వరుసగా చరవాణిలు లాక్కెళ్లారు. ఫిలింనగర్ వద్ద ఓ వ్యక్తి వద్ద మొబైల్ లాక్కునేందుకు ప్రయత్నించగా.. అది కాస్తా కిందపడిపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. మంగళవారం(జనవరి 25న) రాత్రి అదే ఫిలీంనగర్‌లో మరో బాటసారి చేతిలోంచి సెల్‌ఫోన్ లాక్కెళ్లారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఇన్‌కాం ట్యాక్స్ నివాస ప్రాంగణం వద్ద కాపాలాదారుడిగా పనిచేసే వివేక్ మిశ్రా దగ్గర నుంచి కూడా చరవాణి తస్కరించారు. అదే విధంగా ఏసీబీ కార్యాలయం వైపు వెళ్లి... లారీ డ్రైవర్ సైదులు నుంచి మరొక మొబైల్ కొట్టేశారు.

బాధితులు ఆయా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల్లో చిక్కిన నిందితుల చిత్రాలు, బైకు చిత్రాలను అన్ని ఠాణాలకు పంపించారు. ఫొటోలు అస్పష్టంగానే ఉన్నా.. వాటిని క్షుణ్ణంగా గమనించిన బంజారాహిల్స్ పోలీసులు సింగాడికుంట ప్రాంతానికి చెందిన ఇంటర్ చదివే విద్యార్థులుగా అనుమానించారు. ద్విచక్రవాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించగా.. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన తెలుపురంగు టైర్లు మ్యాచ్ కావడంతో నిందితుల విషయంలో నిర్ధరణకు వచ్చారు. వెంటనే ఆ ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: