ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వ్యాపారవేత్త మధుసూధన్ అపహరణ, హత్య కేసులో పోలీసులు కీలక వివరాలు సేకరించారు. సిద్దిపేట జిల్లా రావంచ వాసి మధుసూదన్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్ధిరపడ్డారు. కర్మన్‌ఘాట్‌లో ఉంటూ గంజాయి సరఫరా సహా వివిధ రకాల వ్యాపారాలు చేసేవారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నుంచి.. మహారాష్ట్రకు గంజాయి తరలిస్తూ పలుమార్లు చిక్కారు. తణుకులో అతని లారీపట్టుబడగా మధుసూదన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో జైలుకు వెళ్లగా ఓ హత్య కేసులో అరెస్టయిన సంజు.. మధుసూదన్‌కు పరిచయమయ్యారు. కర్ణాటకలో అతనిపై పలు కేసులున్నాయి.
పథకం వేసి
జైలు నుంచి విడుదలైన తర్వాత.. ఇద్దరు వివిధ రకాల వ్యాపారాలు చేశారు. సంజుకు డబ్బులు అవసరం కావడంతో మధుసూదన్‌ను సమకూర్చమని అడగ్గా ఆస్తి పత్రాలు పెట్టి సుమారు రూ.40 లక్షలు అప్పు తీసుకొని సంజుకి ఇచ్చారు. వాటిని తిరిగి తీర్చడంలో అతను జాప్యం చేశాడు. మధుసూదన్ నుంచి డబ్బులు కోసం ఒత్తిడి ఎక్కువ కావడంతో అతడిని హతమార్చాలని సంజు పథకం వేశాడు. స్నేహితులు సంజీవ్‌గడ్జే, గిరీష్, జగన్నాథ్‌కు విషయం చెప్పాడు. ఈనెల 19న ఇంటికి రావాలంటూ మధుసూదన్‌ని సంజు పిలిపించాడు. అనంతరం మధుసూదన్‌ను పని ఉందంటూ జగన్నాథ్ కారులో సంగారెడ్డి వెళ్లారు. ఆ తర్వాత సంజు మరో నలుగురితో కలిసి మరో కారులో బయలుదేరి వెళ్లారు.
పొలంలో పాతిపెట్టి
సంగారెడ్డిలోని ఓ దాబా వద్ద మద్యం సేవించిన ఐదుగురు... జగన్నాథ్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. హైదరాబాద్‌కు వెళ్లి మధుసూదన్‌ను అపహరించారంటూ కుటుంబ సభ్యులు, సన్నిహితులకు చెప్పాలని జగన్నాథ్ చెప్పగా.. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు జగన్నాథ్‌కి ఫోన్ చేసిన సంజు.. మధుసూధన్ రెడ్డిని హత్యచేసి సంగారెడ్డి జిల్లా డిగ్వాల్ గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో అతని మృతదేహం పాతిపెట్టినట్లు చెప్పాడు. అదే విషయాన్ని జగన్నాథ్ పోలీసులకు తెలిపాడు. నిన్న ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు.. స్థానిక తహసీల్దార్ సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: coal scam case: 3 నెలల్లో రూ. 61.90లక్షలు కొట్టేశారు!