వరంగల్ రూరల్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. నీరుకుల్లా కటాక్షపూర్ వద్ద ఓ ఆటోను తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఘటనా స్థలంలో తెగిపడిన ఓ మృతురాలి కాలు.. ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది.
ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన 20 మంది మహిళలు.. మిరప తోటల్లో పని చేయడానికి నల్లబెల్లి మండలం రంగాపురానికి ఆటోలో వెళ్తున్నారు. నీరుకుల్లా కటాక్షపుర్ మూలమలుపు వద్ద వేగంగా వచ్చిన తుఫాను వాహనం... వీరి ఆటోను ఢీకొట్టింది. ఒక్కసారిగా ఆటో బోల్తాపడి పూర్తిగా నుజ్జునుజ్జయింది. అందులోని పలువురు మహిళలు ఎగిరిపడి రోడ్డుమీద పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. తీవ్రంగా గాయపడిన 9 మంది క్షతగాత్రులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతులు సాంబక్క(60) సరోజన(55), ఎండీ బీబీ (55)గా గుర్తించారు
ఇవీచూడండి: నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. అతివేగమే కారణం