Three farmers died: భారీ వర్షాలతో ముంచెత్తిన వరుణుడు కాస్త శాంతించటంతో.. రైతులు పొలాల బాట పట్టారు. నాట్లు వేసుకుంటూ.. ఇప్పటికే వేసిన పంటల్లో కలుపు తీసుకుంటూ.. పనుల్లో నిమగ్నమైపోయారు. ఇదే సమయంలో మళ్లీ అక్కడక్కడ చిటపట చినుకులు పలకరించాయి. ఆ ముసురును పట్టించుకోకుండా.. పనుల్లో మునిగిపోయిన రైతులపై మృత్యువు పిడుగుల రూపంలో దాడి చేసి మింగేసింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాటుకు మొత్తంగా ముగ్గురు రైతులు బలయ్యారు. వేర్వేరు ప్రాంతాల్లో వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పిడుగులు పడగా.. ముగ్గురు రైతులు పొలాల్లోనే ప్రాణాలు విడిచారు. రేగొండ మండలంలోని పొనగల్లుకు చెందిన వంగ రవి(50) అనే రైతు తన చేనులో కలుపు కుప్పలు తీసేందుకు వెళ్లాడు. పని చేస్తున్న క్రమంలో ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా పిడుగుపడింది. దీంతో.. రవి పొలంలోనే కుప్పకూలిపోయాడు.
చిట్యాల మండలం గోపాలపూర్ గ్రామానికి చెందిన ఆరెపల్లి వరమ్మ(56) గ్రామ సమీపంలోని తన పత్తి చెనులో కలుపు తీస్తోంది. అదే సమయంలో పిడుగు పడడంతో అక్కడికక్కడే వరమ్మ మృతి చెందింది. మల్హర్ మండలానికి చెందిన యువ రైతు కూడా పిడుగుపాటుకు బలయ్యాడు. తాడిచెర్ల పంచాయతి పరిధిలోని శాత్రాజ్పల్లికి చెందిన కాటం రఘుపతి రెడ్డి(25).. తల్లిదండ్రులతో కలిసి పొలంలో నాటు వేసేందుకు వెళ్లాడు. ఒక్కసారిగా పిడుగుపడటంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ మూడు ఘటనలు జిల్లాలో ఒకేరోజు జరగటం.. విషాదకరం.
ఇవీ చూడండి: