ఎస్సారెస్పీలో ముగ్గురు యువకుల గల్లంతు
స్నేహితుల దినోత్సవ సందర్భంగా చిన్ననాటి మిత్రుల విహారయాత్ర విషాదంగా మారింది. నదీ తీరంలో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఆరుగురు మిత్రుల్లో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ దుర్ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం జీజీ నడ్కుడ గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం జరిగింది. నిజామాబాద్‌లోని అర్సపల్లి కాలనీకి చెందిన సాయికృష్ణ, రోహిత్, రాజేందర్, రాహుల్, ఉదయ్, గట్టు శివ బాల్యమిత్రులు. ఆదివారం ద్విచక్ర వాహనాలపై నడ్కుడ శివారులో ఎస్సారెస్పీ వెనుక జలాలు నిలిచే గోదావరి తీరానికి వెళ్లారు.
అక్కడి హనుమాన్ ఆలయాన్ని సందర్శించి, కొద్ది దూరంలో ఉన్న నది ఒడ్డుకు వెళ్లారు. కొంతసేపటి తర్వాత స్నానం చేయడానికి గట్టు శివ నదిలో దిగాడు. లోతు అంచనా తెలియక నీట మునిగాడు. అతడిని కాపాడేందుకు మిగతా మిత్రులు నీటిలోకి దిగారు. శివ (19)తో పాటు రాహుల్ (20), ఉదయ్ (19) నదిలో గల్లంతయ్యారు. మిగిలిన ముగ్గురూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న నందిపేట్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాజెక్టులో నీరు లేని సమయంలో స్థానిక రైతులు తమ పొలాలకు మట్టి కోసం ఇక్కడ తవ్వకాలు చేపడతారు. ఆ గుంతల్లో నీరు చేరడంతో ప్రమాదానికి దారితీసిందని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: 'కుటుంబ సభ్యులే మోసం చేశారు'.. పిల్లలతో సహా దంపతులు గోదారిలో దూకారు