Car Accident: రాజధాని శివారులోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. చింతల్మెట్ హకీం హిల్స్ వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి హత్యకు యత్నించారు. యువతిని ఢీకొట్టిన వెంటనే దుండగులు కారులో పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతిని గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తలకు బలమైన గాయమైందని వైద్యులు వెల్లడించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు.. రోడ్డుప్రమాదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు సుమియా బేగం(19) టైలరింగ్ శిక్షణ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదమా? హత్యాయత్నమా? అనే కోణంలో ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా కారులో ఉన్నవారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కుటుంబసభ్యులు కూడా రోడ్డు ప్రమాదంగానే చెబుతుండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికులు కూడా యువతిని ప్రేమించిన వ్యక్తే హత్యకు యత్నించాడంటున్నారు.
ఇవీ చదవండి: