Tortured by Father in East Godavari: భార్యపై కోపంతో ఉన్మాదిలా మారాడొక భర్త. కన్న బిడ్డలని కూడా చూడకుండా చిన్నారులను చిత్రహింసలకు గురి చేశాడు. పైగా ఆ దృశ్యాలను వీడియో తీసి భార్యకు పంపుతూ రాక్షసానందం పొందుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది .
ఏపీలోని తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామానికి చెందిన గంజి దావీదుకు భార్య నిర్మల, 11, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మద్యానికి బానిసైన అతడు ఏ పనీ లేకుండా తిరిగేవాడు. భార్యపై అనుమానం పెంచుకొని తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో ఆమె పిల్లలను భర్త వద్ద వదిలి జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లింది. పిల్లలను తీసుకుని దావీదు ఇటీవల అదే మండలంలో ఉన్న పెంటపాడు గ్రామానికి మకాం మార్చాడు.
భార్యను ఎలాగైనా దుబాయ్ నుంచి రప్పించాలనే ఉద్దేశంతో కుమార్తెలను విచక్షణరహితంగా కొడుతూ.. చంపేస్తానని కత్తితో బెదిరిస్తూ.. వారు భయంతో కేకలు వేస్తుంటే ఆ దృశ్యాలను కొడుకుతోనే వీడియో తీయించి ఆమెకు పంపడం మొదలెట్టాడు. అవి చూసి తల్లడిల్లిన ఆమె వాటిని గ్రామంలోని సర్పంచికి పంపగా ఆయన పోలీసులకు తెలియజేశారు. తాడేపల్లిగూడెం గ్రామీణ సీఐ మూర్తి, ఎస్సై జి.సత్యనారాయణ గ్రామానికి చేరుకుని పిల్లల నుంచి వివరాలను సేకరించి కేసు నమోదుచేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇవీ చదవండి: