Farmer Suicide: పొట్టదశలో ఉన్న వరి పొలానికి నీరందక ఎండిపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొలన్‌పల్లిలో జరిగింది. చేతికంది వచ్చిన కొడుకు కళ్లముందే విగతజీవిగా మారడంతో మృతుని తల్లిదండ్రులు, భార్య, పిల్లలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రాయపర్తి ఎస్సై బండారి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కాడబోయిన రాజ్‌కుమార్(30) తనకున్న మూడెకరాల్లో వరి పంట వేశారు. వేసవి నేపథ్యంలో బోరు, బావిలో నీరు అడుగంటగా రెండెకరాల పొలం ఎండిపోయింది. దీంతో ఏం చేయాలో తోచక ఆ యువరైతు రాజ్‌కుమార్ ఆదివారం పొలం వద్ద పురుగుల మందు తాగారు. గమనించిన స్థానిక రైతులు, కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు తల్లిదండ్రులు, భార్య రేణుక, బాబు, పాప ఉన్నారు. రేణుక ప్రస్తుతం గర్భవతి. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. బంగారం కోసం ప్రాణం తీశాడు