నేటి తరం పిల్లలు టీవీలు, మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్నారు. ఎక్కువసేపు ఫోన్ వాడొద్దని తల్లిదండ్రులు వారిస్తే గొడవ పడుతున్నారు. కాస్త మందలిస్తేనేమో.. ఆత్మహత్యల(Boy committed suicide)కు పాల్పడుతూ కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. ఐదారేళ్ల పసిపిల్లల నుంచి 20 ఏళ్ల యువతీయువకుల వరకు అందరిదీ ఇదే పరిస్థితి.
తాజాగా.. భూపాలపల్లి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సెల్‌ఫోన్‌తో ఆడుకుంటుండగా కిందపడి పగలింది. ఈ విషయం తెలిసే తల్లి కొడుతుందేమోనని భయపడ్డాడు ఓ 12 ఏళ్ల బాలుడు. ఆ భయంతోనే ఇంట్లో నుంచి పారిపోయాడు. రెండ్రోజుల తర్వాత ఊరి చివర బావిలో శవమై తేలాడు.
చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన చరణ్ ఇంట్లోని మొబైల్ ఫోన్‌తో ఆడుకుంటుండగా అది కింద పడి పగిలింది. తల్లి కొడుతుందేమోనని రెండ్రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయాడు. కుమారుడు కనిపించడం లేదని వెతికిన ఆ తల్లికి బాలుడి జాడ కానరాలేదు. ఫోన్ తీసుకెళ్లాడేమో అని కాల్ చేసి చూస్తే.. మొబైల్ ఇంట్లోనే ఉంది. అది పగిలిపోయి ఉండటం గమనించిన తల్లి.. భయపడి బయటకు వెళ్లుంటాడని అనుకుంది. ఎంతసేపైనా రాకపోయేసరికి ఆందోళన చెందింది. చుట్టుపక్కల వాళ్ల ఇళ్లలో.. బంధువులు, స్నేహితులను అడిగింది. ఎక్కడా కనిపించకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. మంగళవారం ఉదయం ఓ వ్యవసాయ బావిలో చరణ్ మృతదేహాన్ని(Boy committed suicide) చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న వారు.. ఆ మృతదేహాన్ని పరిశీలించి అది చరణ్దేనని నిర్ధరించారు. ఫోన్ పగలడం వల్ల తల్లి కొడుతుందేమోననే భయంతో బావిలోకి దూకి ఉంటాడని భావిస్తున్నట్లు చెప్పారు.
అనంతరం బావిలో మృతదేహం గురించి చరణ్ తల్లిదండ్రులకు తెలిపారు. కన్నకొడుకు కళ్లముందే నిర్జీవంగా ఉండటం చూసిన ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. ఆమె రోదన చూసిన స్థానికులు కంటతడి పెట్టారు.