రాష్ట్ర రాజకీయాల్లో బెంగళూరు మాదకద్రవ్యాల కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఎమ్మెల్యేల ప్రమేయం ఉందంటూ వార్తలు వస్తున్న వేళ.. వాళ్లు ఎవరు, ఎంతమంది ఉన్నారన్న దానిపై రాజకీయవర్గాల్లో.. జోరుగా చర్చ సాగుతోంది. బెంగళూరులో మత్తు పదార్థాలు, ఇరానీ అమ్మాయిల నృత్యాలతో జరిగిన విందులకు నలుగురు ఎమ్మెల్యేలు హాజరైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో కింది స్థాయి కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేల వరకు చర్చోపచర్చలు జరుగుతున్నారు. ఏ ఇద్దరు నేతలు.. పార్టీ కార్యకర్తలు కలిసినా.. ఆ ఎమ్మెల్యేలు ఎవరంటూ చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో స్థిరాస్తి వ్యాపారం చేసే నెల్లూరుకు చెందిన సందీప్ రెడ్డి వాంగ్మూలంలో వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ యువ ఎమ్మెల్యే పేరు ప్రస్తావించారు. రెండుసార్లు విందుకు హాజరైనట్లు సందీప్ రెడ్డి పేర్కొన్నారు. మిగతా ఎమ్మెల్యేలు ఎవరనే అంశంపై తెరాసతో పాటు వివిధ పార్టీల్లో రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఫలాన వారే అంటూ గుసగుసలాడుకుంటున్నారు.
అయితే అనుమానిత ఎమ్మెల్యేలు కానీ.. తెరాస నేతలు కానీ ఎక్కడా దీని గురించి బహిరంగంగా మాట్లాడటం లేదు. అసలు ఏం జరిగింది... బయటకు ఎలా వచ్చింది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరొవైపు ఎమ్మెల్యేలపై ఆరోపణలు రావడంతో... గులాబీ పార్టీ నాయకత్వం వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు వెళ్లారా.. ఒకవేళ వెళ్తే మాదక ద్రవ్యాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉందా.. కేవలం వ్యాపార కోణంలో వెళ్లారా? మరే ఇతర వ్యవహరాల కోసం వెళ్లారా? అనే వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది
ఇదీ చదవండి:అచ్చంపేటలో 830 కిలోల నల్లబెల్లం పట్టివేత