వికారాబాద్ జిల్లా తాండూరులో తొమ్మిది రోజుల మగ శిశువును విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దేముల్ మండలం బుద్ధారం గ్రామానికి చెందిన భీమమ్మ, రాములు దంపతులకు నాలుగేళ్ల బాబు ఉన్నాడు. రెండో కాన్పులోను మగ శిశువు జన్మించాడు. అంతకుమునుపు రాములు తన అత్త లక్ష్మి వద్ద రూ.40 వేలు అప్పు చేశాడు. ఈ క్రమంలో తన అప్పు తీర్చాలని అత్త అల్లుడిపై ఒత్తిడి తీసుకువచ్చింది.
రాములు తన వద్ద అంత డబ్బు లేదని.. ' నా బిడ్డ నీ దగ్గరే ఉన్నాడు కాబట్టి.. వాడిని అమ్ముకొని అప్పు మాఫీ చేసుకో' అని అత్తతో అన్నాడు. ఇదే అదనుగా భావించిన లక్ష్మి.. సొంత మనవడిని పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి రూ.70 వేలకు అమ్మేసింది. తనకు రావాల్సిన డబ్బు తీసుకుని మిగతా డబ్బులు అల్లుడికి ఇచ్చేసింది.
విషయం ఆ నోట ఈ నోట బయటకు పొక్కడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రాములును విచారించారు. తన కుమారుడిని అత్త విక్రయించినట్లు వెల్లడించాడు. ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.
ఇదీ చదవండి: అనుమతులు లేవని బెదిరింపులకు పాల్పడుతోన్న వ్యక్తి అరెస్ట్