ఎన్ని కఠిన చట్టాలు అమలు చేసినా మహిళలు, బాలికలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. క్షణికావేశంలో చేస్తున్న తప్పిదాలు దారుణ ఫలితాలను మిగుల్చుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరులోని పరమాయికుంట వద్ద టిఫిన్ తీసుకెళ్లేందుకు వచ్చిన యువతి దారుణ హత్యకు(murder in guntur) గురైంది. పట్టపగలే ఈ ఘటన జరగడం.. స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.
గుంటూరు పెదకాకాని రోడ్డులోని పరమాయికుంటలో అల్పాహారం తీసుకెళ్లేందుకు హోటల్‌కు వచ్చిన యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచాడు. తీవ్ర రక్తస్రావమైన బాధితురాలిని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దాడి చేస్తున్న సమయంలో అడ్డుకునేందుకు యత్నించిన స్థానికులను కత్తితో బెదిరించి.. ద్విచక్ర వాహనంపై దుండగుడు పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఘటనకు గల కారణాలను మృతురాలి తల్లి, సోదరుడిని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ అడిగి తెలుసుకున్నారు. మృతురాలు బీటెక్ నాల్గో సంవత్సరం చదువుతున్నట్లుగా గుర్తించారు. యువతికి పరిచయం ఉన్న యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. యువతి హత్యతో తల్లిదండ్రులు, బంధువులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది.
ఇదీచదవండి: FATHER HARRASMENT CASE: మరో పది నిమిషాల్లో అమెరికా ఫ్లైట్.. అంతలోనే పోలీసులకు చిక్కాడు