Instagram Cheating :సామాజిక మాధ్యమాల్లో యువతి పేరు, ఫొటోతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే.. ఏ అమ్మాయైనా సరే ఆడపిల్లే కదా అని యాక్సెప్ట్ చేస్తుంది. వారితో వ్యక్తిగత విషయాలు, ఫొటోలు పంచుకోవడానికి వెనుకాడరు. అదే వారి కొంప ముంచింది. అమ్మాయి పేరుతో ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయాలు పెంచుకుని.. యువతుల నుంచి ఫొటోలు తీసుకుని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు ఓ కామాంధుడు. అతని ఆటగట్టించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.
బెదిరింపులు
ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి ప్రొఫైల్ ఫొటోతో ఖాతా తెరిచిన యువకుడు అమ్మాయిగా పరిచయం చేసుకుని మోసాలకు తెరలేపాడు. అమ్మాయిగా భావించిన యువతులు.. అతనికి ఫొటోలు పంపించారు. వాటిని అడ్డం పెట్టుకుని ఆ కామాంధుడు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. న్యూడ్ ఫొటోలు పంపించకపోతే మార్ఫింగ్ చేస్తానని బెదిరింపులకు దిగేవాడు. కోరిక తీర్చకపోతే న్యూడ్ ఫొటోలు సామాజికమాధ్యమాల్లో పెడతానని బ్లాక్‌మెయిల్ చేసేవాడు.
మల్టీ మీడియా చదువుతూ
ఈ క్రమంలో 15 రోజుల క్రితం ఓ యువతి ధైర్యం చేసి నిందితుడిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు అజయ్‌గా గుర్తించారు. దిల్‌సుఖ్‌నగర్‌లో అజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు వరంగల్ జిల్లా పరకాల వాసిగా పోలీసులు తెలిపారు. హైదరాబాద్ ఉంటూ మల్టీమీడియా చదువుతున్నట్లుగా పేర్కొన్నారు. చాలామంది అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేసినట్లు విచారణలో తేలింది.
ఇదీ చదవండి: B.tech Student Suicide Bachupally : 'జీవితంపై విరక్తితోనే చనిపోతున్నా'.. విద్యార్థి ఆత్మహత్య