రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ నిధుల స్వాహా(Telugu akademi FD scam 2021) కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అకాడమీ అధికారులను విచారిస్తూ వారి నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. మాజీ సంచాలకుడు సోమిరెడ్డి, ఒప్పంద ఉద్యోగి రఫీలను సీసీఎస్ పోలీసులు మూడు గంటలకు పైగా ప్రశ్నించారు. వారి వాంగ్మూలం నమోదు చేశారు.
రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)ను తీసుకెళ్లాక బ్యాంకులో జమ అయినట్టు బ్యాంకు అధికారుల నుంచి ఎందుకు నిర్ధారించుకోలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. నకిలీ రసీదులని తెలిసిన తరువాత కూడా మౌనంగా ఉండటంపై నిలదీసినట్లు సమాచారం. మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకూ వివిధ అంశాలపై సోమిరెడ్డి సమాచారం రాబట్టారు. డైరెక్టర్ హోదాలో ఉన్న అధికారి ఆర్థిక విషయాల పట్ల అజాగ్రత్తగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. బాధ్యతగా ఉండాల్సిన సమయంలో ఉదాసీనతపై ప్రశ్నించగా తాను ఇన్‌ఛార్జిని మాత్రమేనని, పూర్తిస్థాయి అధికారిని కాదంటూ చెప్పారని సమాచారం. గోల్‌మాల్‌కు సంబంధించి బ్యాంకులోని రూ.12 లక్షలను సీజ్ చేశారు. తెలుగు అకాడమీలో సీసీ ఫుటేజీని అందజేయాలని కోరగా.. త్రిసభ్య కమిటీ అధీనంలో ఉన్నట్లు అకాడమీ అధికారులు చెప్పారు.
కేసులో కీలకమైన యూబీఐ మేనేజర్ మస్తాన్‌వలీను ఫిక్స్‌డ్ డిపాజిట్ల(Telugu akademi FD scam 2021)ను నగదుగా ఎందుకు మార్చారని పోలీసులు ప్రశ్నించగా... డైరెక్టర్ సంతకం ఉండటంతో తాను నమ్మినట్టు తెలిపారు. అవసరమైన పత్రాలు ఉండటం వల్లే వారిని నమ్మి నగదు బదిలీ చేశానని చెప్పినట్టు సమాచారం. అయితే ఈ వ్యవహారంలో మస్తాన్‌వలీ, సత్యనారాయణ కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్న పోలీసులు మస్తాన్‌వలీ సారథ్యంలోనే 6 నెలలుగా నగదు విత్‌డ్రా చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఏపీ, ముంబయి, హైదరాబాద్‌తో పాటు పలు నగరాల్లోని బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్మును జమ చేసినట్లు తెలుసుకున్నారు. యూబీఐ, కెనరా బ్యాంకుల్లోని ఖాతాలనూ పరిశీలిస్తున్నట్లు భోగట్టా.
ఈ కేసు(Telugu akademi FD scam 2021)తో సంబంధం ఉన్న మరికొంత మంది పరారీలో ఉన్నారని..వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో ఇద్దరు, ముగ్గురిని అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పారు. అకాడమీకి చెందిన కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లను పక్కా ప్రణాళిక ప్రకారమే స్వాహా చేసినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. గత నెలలో ఫిక్స్‌డ్ డిపాజిట్లను తీసుకువెళ్లేందుకు రాజ్‌కుమార్ అనే వ్యక్తి తెలుగు అకాడమీకి వెళ్లాడు. తాను బ్యాంకు ఉద్యోగినంటూ గుర్తింపు కార్డు చూపాడు. కొత్త వ్యక్తి కావడం వల్ల అకాడమీ ఉద్యోగి రఫీ యూబీఐ మేనేజర్ మస్తాన్ వలీకి ఫోన్ చేసి నిర్ధారించుకుని ఎఫ్‌డీలు రాజ్‌కుమార్‌కు ఇచ్చాడు. పోలీసుల విచారణలో మాత్రం రాజ్‌కుమార్ ఎవరో తనకు తెలియదని మస్తాన్‌వలీ చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. మస్తాన్ వలీకి రాజ్‌కుమార్ ఏజెంట్‌గా పనిచేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. రాజ్‌కుమార్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.
ఈ ఏడాది జనవరిలో అగ్రసేన్ బ్యాంకులో నిందితులు రెండు ఖాతాలు తెరిచినట్టు పోలీసులు గుర్తించారు. జనవరి 16 నుంచి సెప్టెంబరు వరకు దశల వారీగా రెండు ఖాతాలకు డబ్బు మళ్లించినట్టు తేలింది. యూనియన్ బ్యాంకు కార్వాన్ శాఖ నుంచి రూ.43 కోట్లు, సంతోశ్‌నగర్ శాఖ నుంచి రూ.10 కోట్లు, కెనరా బ్యాంకు చందానగర్ శాఖ నుంచి రూ.10 కోట్లు అగ్రసేన్ బ్యాంకు రెండు ఖాతాలకు మళ్లించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ రావు సహకారంతో విడతల వారీగా సొమ్ము విత్ డ్రా చేసుకున్నట్టు బయటపడింది. ఖాతాల నుంచి డబ్బు విత్ డ్రా చేసి ఎక్కడికి తీసుకువెళ్లారు అని పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.
నిధుల స్వాహా వెనుక అకాడమీలోని ఒకరిద్దరు అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన నలుగురు నిందితులను పోలీసు కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం సోమవారం విచారించనుంది.