Sexual harassment by teachers on students : గురువు అంటే తండ్రిలాంటివాడు.. విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలి.. విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఉన్నతంగా తీర్చిదిద్దాలి. అలాంటిది కొందరు ఆచార్యులు గాడి తప్పుతున్నారు. విద్యార్థినులపై కన్నేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించే పేరిట వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. నగరంలోని యూనివర్సిటీలలో ఘటనలు సభ్య సమాజం తలదించుకునే స్థితికి తీసుకెళుతున్నాయి. ఇప్పటికే పాఠశాల స్థాయిలో అభంశుభం ఎరుగని చిన్నారులను లైంగిక వేధిస్తున్న ఘటనలు వెలుగుచూడగా.. తాజాగా హెచ్‌సీయూలో పీజీ విద్యార్థినిపై అత్యాచార యత్నం వర్సిటీ ప్రతిష్ఠను మరింత దిగజార్చింది.
పీహెచ్‌డీ స్థాయిలోనూ అధికం: వర్సిటీలలో పీహెచ్‌డీ స్థాయిలో విద్యార్థులకు మానసిక, శారీరక వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయి. పీహెచ్‌డీ సిద్ధాంత సమర్పణ సమయంలో ‘గురుదక్షిణ’ పేరిట భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని కొందరిపై ఆరోపణలున్నాయి. అయితే విద్యార్థులు ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ఎందుకంటే అలా చేస్తే పీహెచ్‌డీ అవార్డు చేయడం నిలిపివేస్తారన్న భయం వారిలో నాటుకుపోయింది.
నామ్ కే వాస్తేగా ఫిర్యాదుల కమిటీలు: ఉన్నత విద్యాసంస్థల్లో ఫిర్యాదులకు ప్రత్యేకంగా కమిటీ ఉండాలని యూజీసీ సూచిస్తోంది. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయాలు పెడచెవిన పెడుతున్నాయి. అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ఐసీసీ), లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా లింగ సమానత్వ కమిటీ(జీఎస్ క్యాష్) ఏర్పాటు చేసి వేధింపులకు సంబంధించి ఫిర్యాదు స్వీకరించాలి. ప్రతి ఆరు నెలలకోసారి సమావేశాలు నిర్వహించారు. ఆయా కమిటీలు నామ్ కే వాస్తేగా మారాయి.
వరుస ఘటనలతో ఆందోళ:
- దశాబ్దం కిందటా హెచ్‌సీయూలో లైంగిక వేధింపుల విషయం వెలుగు చూసింది.
- కొన్నినెలల కిందట పాలన విభాగంలో ఓ మహిళతో అధికారి అసభ్యంగా మాట్లాడుతూ వేధించిన ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. అతనిపై కనీసం విచారణ జరగలేదు. సదరు అధికారి మరింత రెచ్చిపోయి మహిళను వేధింపులకు గురిచేయడంతోపాటు ఉద్యోగంలోనూ అడ్డంకులు సృష్టించినట్లు తెలిసింది.
- ఇటీవల ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆచార్యుడు ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై ఓయూ ఠాణాలోనూ కేసు నమోదైంది. అధికారులు సదరు ఆచార్యుడిపై కనీస చర్యలు తీసుకోకుండా రాజీ కుదిర్చే యత్నించారన్న ఆరోపణలుఉన్నాయి.
"విద్యాసంస్థల్లో ఐసీసీ వ్యవస్థను బలోపేతం చేయాలి. విద్యార్థినులు ఏదైనా సమస్యపై ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసేలా ఉండాలి. ఫిర్యాదు స్వీకరణకు విభాగాల వద్ద ప్రత్యేక బాక్సులు ఏర్పాటు చేయాలి. లింగ సమానత్వంపై వర్సిటీలోని అందరికీ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తుండాలి."- ఎ.రవీంద్రనాథ్, యూజీసీ సబ్జెక్టు కమిటీ నిపుణులు
ఇవీ చదవండి: