Misbah suicide case Updates: చిత్తూరు జిల్లా పలమనేరులో ఇటీవల మిస్బా అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న కేసులో ఉపాధ్యాయుడు రమేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని తమిళనాడులోని రామేశ్వరంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేశ్ భార్య నడుపుతున్న ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థిని మిస్బా.. కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది.
Student Suicide in palamaner: చిత్తూరు జిల్లాలో పదో తరగతి విద్యార్థిని మిస్బా నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. బాగా చదవడమే తనకు ఇబ్బందిగా మారిందంటూ.. మిస్బా రాసిన కన్నీటి లేఖ గురువారం బయటపడింది. తాను మొదటి ర్యాంకు సాధించడం తన తోటి విద్యార్థినికి ఇష్టం లేదంటూ ఆ లేఖలో పేర్కొంది. మిస్బా ప్రస్తావించిన విద్యార్థిని వైకాపా నేత కుమార్తె కావడం వివాదానికి ఆజ్యం పోసింది. తన కుమార్తెకే మొదటి ర్యాంకు రావాలని వైకాపా నేత ఒత్తిడి చేయడంతోనే... పాఠశాల యాజమాన్యం విద్యార్థిని మిస్బాను వేరే పాఠశాలకు టీసీ ఇచ్చి పంపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పలమనేరులోని బ్రహ్మర్షి పాఠశాలలో చదువుతున్న మిస్బా.. మరో నెల రోజుల్లో పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. ఈ తరుణంలో మిస్బాకు టీసీ ఇచ్చి వేరే పాఠశాలకు పంపింది యాజమాన్యం. ఆ తర్వాత మూడు రోజులకే మిస్బా ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఉరి వేసుకుని చనిపోవడంపై.. వివిధ రకాల వాదనలు వినిపించాయి. అయితే.. తాజాగా బయటకు వచ్చిన మిస్బా రాసిన లేఖ ద్వారా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశాలు కేసును మలుపుతిప్పేలా ఉన్నాయి. తాను బాగా చదువుతున్నందున తోటి విద్యార్థిని బాధపడుతోందంటూ.. మిస్బా లేఖలో ప్రస్తావించిన అమ్మాయి.. వైకాపా నేత కుమార్తె కావడం చర్చనీయాంశమైంది.
మిస్బా ఆత్మహత్య కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై గురువారం సస్పెండ్ వేటు పడింది. గంగవరం జెడ్పీ హైస్కూల్లో హిందీ పండిట్‌గా పనిచేస్తున్న రమేశ్‌ను సస్పెండ్ చేస్తూ.. డీఈవో శ్రీధర్ ఉత్తర్వులు ఇచ్చారు.
ఇవీ చదవండి : అధికార పార్టీ నేత కూతురి కోసం.. చదువుల తల్లిని చంపేశారా?