Lovers Suicide: ప్రేమ విఫలం అవుతుందన్న భయంతో ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తితిదే ఆధ్వర్యంలోని పద్మావతి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాలకు చెందిన వసతిగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు చిత్తూరు జిల్లా కె.విపల్లి మండలం గర్నిమిట్టకు చెందిన విష్ణుప్రియగా పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం కువైట్‌కి వెళ్లడంతో విష్ణుప్రియ హాస్టల్లో ఉంటూ చదువుతోందని చెప్పారు. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పడం.. వారు నిరాకరించడంతో విష్ణుప్రియ ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఘటనాస్థలంలో 3 ప్రేమలేఖలు, బహుమానాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హాస్టల్ భవనం నుంచి దూకి: మరో ఘటనలో తిరుపతిలోని వెస్ట్ చెర్చ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ బాలుర వసతిగృహంలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న నాగేంద్ర కుమార్ అనే విద్యార్థి... హాస్టల్ భవనం ఐదో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం భీమగానిపల్లివాసిగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని సహచర విద్యార్థులు చెబుతున్నారు. ఎస్వీయూ క్యాంపస్ పోలీసులు.. ఆత్మహత్యలకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: Suicide: పెళ్లి పీటలెక్కాల్సిన యువతి.. బావ వేధింపులకు బలి