ఫ్లాట్లు నిర్మించి ఇస్తానని చెప్పి లక్షల్లో సొమ్ము వసూలుచేసి చేతులెత్తేసిన ఘరోండ బిల్డర్స్ యజమాని సునీల్ జె.సచ్‌దేవ్‌కు జైలుశిక్ష విధిస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ గురువారం సంచలన తీర్పు వెలువరించింది. మూడు కేసుల్లో వేర్వేరుగా 6 నెలల చొప్పున విధిస్తూ..ఒక శిక్ష పూర్తయ్యాక మరొకటి అమల్లోకి వస్తుందని స్పష్టంచేసింది. సొమ్ము తీసుకుని ఫ్లాట్‌లు అప్పగించడం లేదంటూ పలువురు కొనుగోలుదారులు గతంలో రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన కమిషన్ 2017లో వేర్వేరుగా తీర్పులు వెలువరించింది. సికింద్రాబాద్‌కు చెందిన టి.ఆర్.కుమార్ మరొకరికి రూ.12.43 లక్షలు 12 శాతం వడ్డీతో, ఆర్.ఈశ్వరి ప్రసాద్ మరో ముగ్గురికి రూ.40.62 లక్షలు 9 శాతం వడ్డీతో, ఆంధ్రప్రదేశ్ నరసరావుపేటకు చెందిన సీహెచ్.ఆనంద్‌కు రూ.21.97 లక్షలు 9 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. అయితే నిర్మాణదారు ఈ సొమ్మును తిరిగి ఇవ్వడంగానీ, కమిషన్ తీర్పుపై అప్పీలుకు వెళ్లడంగానీ చేయలేదు. ఈ నేపథ్యంలో తీర్పు అమలును కోరుతూ 2017లో బాధితులు మళ్లీ కమిషన్‌లో పిటిషన్‌లు దాఖలుచేశారు. విచారించిన కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్, సభ్యులు మీనా రామనాథన్, కె.రంగారావులతో కూడిన ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది.
అవకాశాలను వినియోగించుకోనందునే
‘‘పిటిషన్ దాఖలై అయిదేళ్లు గడిచినా బిల్డర్ తీర్పు అమలు చేయలేదు. ఆయనకు పలు అవకాశాలు ఇచ్చాం. పిటిషనర్లు అభ్యంతరం చెప్పినా తగిన ఫలితం లభించాలన్న ఉద్దేశంతో గడువు మంజూరు చేస్తూవచ్చాం. పద్మారావునగర్‌లోని ఆస్తిని విక్రయించి పిటిషనర్లతోపాటు పలువురికి సొమ్ము చెల్లిస్తానంటూ అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ చెల్లించలేదు. చివరికి చెల్లించలేనంటూ చేతులెత్తేశారు. తనను దివాలాదారుగా ప్రకటించాలని కోరుతూ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని, దానిపై నిర్ణయం వెలువడేదాకా వాయిదా వేయాలని బిల్డర్ కోరారు. కమిషన్ ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.
కమిషన్ శిక్ష విధించొచ్చు
వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినప్పుడు నెల నుంచి మూడేళ్ల దాకా కమిషన్ శిక్ష విధించవచ్చు. ఇదే విషయాన్ని గతంలో హైకోర్టు ఫుల్‌బెంచ్‌తోపాటు సుప్రీం కోర్టు సి.వి.రత్నం వర్సెస్ కేంద్రం కేసులో ధ్రువీకరించిందని’’ ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ఆ ప్రకారమే కమిషన్ తీర్పు అమలుచేయని ఘరోండ బిల్డర్స్ యజమాని సునీల్ జె.సచ్‌దేవ్‌కు 6 నెలల జైలు శిక్ష విధిస్తున్నామని తెలిపింది.
ఇవీ చదవండి:
- సీఎం ఇఫ్తార్ విందు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడో చూసుకొని వెళ్లండి..
- భానుడి భగభగలు.. త్వరలో మరింత విజృంభణ.. ఆ రాష్ట్రాలకు హెచ్చరిక!