సూర్యాపేటలో 47వ జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రేక్షకుల గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలడంతో వంద మందికి పైగా గాయపడ్డారు . బాధితులనందరినీ పోలీసులు, ప్రేక్షకులు సమీప ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులను మైరుగైన చికిత్స కోసం అవసరమైతే హైదరాబాద్‌కు తరలిస్తామని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సుమారు 15 వేల మంది కూర్చొనేలా మూడు గ్యాలరీలు ఏర్పాటుచేశారు . అంతలోనే మైదానానికి తూర్పు వైపు ఏర్పాటుచేసిన పురుషుల గ్యాలరీ కుప్పకూలిపోయింది.
పరీక్షించకపోవడం వల్లే ప్రమాదం
రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సహకారంతో తలపెట్టిన ఈ జాతీయస్థాయి పోటీల్లో 29 రాష్ట్రాల నుంచి 60 జట్లు పాల్గొంటున్నాయి. ప్రమాద సమయంలో గ్యాలరీపై సుమారు 3వేల మంది కూర్చున్నారు . నిర్వాహకులు మాత్రం 5 వేలమంది కూర్చోవచ్చని నిర్వాహకులు ప్రకటించినా... అంతకంటే తక్కువమంది కూర్చున్నా...కుప్పకూలిపోవడం గమనార్హం. గ్యాలరీల సామర్థ్యాన్ని పరీక్షించకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నామని, బాధ్యులపై కేసు నమోదు చేస్తామని ఎస్పీ భాస్కర్ చెప్పారు. క్షతగాత్రులను మంత్రి జగదీశ్ రెడ్డి పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషిచేస్తామని చెప్పారు.
దిగ్భ్రాంతి వ్యక్తం
కబడ్డీ పోటీల స్టేడియంలో ప్రమాదం జరగడంపై గవర్నర్ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారంతా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు . క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆకాంక్షించారు . భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిమితికి మించి ప్రేక్షకులు ఉన్నా నియంత్రించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
సోమవారం రాత్రి 9 గంటల తర్వాత కబడ్డీ పోటీలను ఎంపీ లింగయ్య యాదవ్ ప్రారంభించారు. వివిధ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.
ఇవీచూడండి: కబడ్డీ పోటీల్లో అపశ్రుతి.. 150 నుంచి 200 మంది వరకు గాయాలు