గతంలో తాత్కాలిక పద్ధతిలో పని చేసిన స్టాఫ్ నర్స్ ఆత్మహత్య(Suicide Attempt)కు యత్నించిన ఘటన మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. పట్టణంలోని క్రిస్టియన్‌పల్లికి చెందిన సుజాత.. మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో తాత్కాలిక పద్ధతిలో ఏడాదిపాటు స్టాఫ్ నర్స్‌గా పని చేశారు. ఇటీవలే ఒప్పంద గడువు తీరడం వల్ల అధికారులు ఆమెను విధుల నుంచి తొలగించారు. కొన్ని రోజులు తనను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమె నిరసన వ్యక్తం చేశారు.
థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకుని..
కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించినా.. తనను తొలగించారని ఆవేదన చెందారు. ఉద్యోగం నుంచి తొలగించడం వల్ల.. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి లేక మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే థైరాయిడ్ చికిత్సలో ఉపయోగించే ట్యాబ్లెట్లు వేసుకుని ఆత్మహత్య(Suicide Attempt)కు యత్నించారు. దాదాపు 200 మాత్రలను మింగినట్లు తెలుస్తోంది.
నిలకడగా ఆరోగ్యం..
గమనించిన కుటుంబ సభ్యులు వెంటవే ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. మొన్నటివరకు తమతో పనిచేసిన ఆమె.. ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉండటం తమను కలిచివేస్తోందని వైద్యులు అన్నారు.
" కరోనా కాలంలో చాలా ధైర్యంతో కొవిడ్ బాధితులకు స్టాఫ్ నర్సులు సేవలందించారు. ఇళ్లకు కూడా సరిగ్గా వెళ్లకుండా సర్వీస్ చేశారు. రోజుల తరబడి పీపీఈ కిట్లు ధరించారు. ఒక నోటీసు కూడా ఇవ్వకుండా.. అకస్మాత్తుగా విధుల్లో నుంచి వాళ్లను నిర్దాక్షిణ్యంగా విధుల్లో నుంచి తొలగించారు. తన తోటి ఉద్యోగినులకైనా.. న్యాయం జరగాలనే ఉద్దేశంతో సుజాత ఆత్మహత్యకు యత్నించారు."
- ఓబేదుల్లా కొత్వాల్, కాంగ్రెస్ నేత, మహబూబ్‌నగర్ జిల్లా
పలువురి పరామర్శ...
ఈ విషయం తెలుసుకున్న పలు కార్మిక సంఘాలు, పార్టీల నేతలు సుజాతను పరామర్శించారు. ఆమెకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. ఎలాగైనా సుజాతకు మళ్లీ ఉద్యోగం వచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.