చదువుల పేరుతో విదేశాలకు వెళ్లిన కుమారుడు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. చివరకు స్వదేశం వచ్చి సైకోగా మారాడు. వద్దంటున్నా వినకుండా టీవీ పెట్టాడన్న ఆగ్రహంతో కన్న తండ్రినే కడతేర్చాడు ఆ దుర్మార్గుడు. నంద్యాల అంజిరెడ్డి అనే వ్యక్తిని అతని కుమారుడు అమరసింహారెడ్డి హతమార్చాడు. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం నారాయణగూడెంలో జరిగింది.
కెనడా వెళ్లి డ్రగ్స్‌కు బానిస అయ్యాడు..
కుమారుడి కోసం ఉన్న భూములు విక్రయించి కెనడాకు పంపించాడు ఆ తండ్రి. అక్కడ డ్రగ్స్‌కు అలవాటు పడిన కుమారుడు ఏమాత్రం ప్రయోజకుడు కాకుండా అప్పులు చేసి భారమయ్యాడు. నాలుగేళ్ల క్రితం స్వదేశానికి వచ్చి ఇంటివద్దనే ఉంటున్నాడు. డ్రగ్స్ వల్ల మతిస్థిమితం కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. డబ్బుల కోసం తండ్రితో పలుమార్లు గొడవ పడే వాడని తెలిపారు. ఐదేళ్ల క్రితం భార్య మృతి చెందడం వల్ల అంజిరెడ్డి కుమారుడి బాగోగులు చూస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు.
టీవీ ఆపేయలేదని హతమార్చాడు..
మత్తుకు అలవాటు పడిన అమరసింహా రెడ్డి ఇరుగు పొరుగుతో సంబంధం లేకుండా ఇంటికే పరిమితమయ్యాడు. చిన్నపాటి సమస్యకు తండ్రితో నిత్యం ఘర్షణ పడటం... ఆపై దాడి చేయడం సహజంగా మారింది. అదేక్రమంలో టీవీ చూస్తున్న తండ్రిని ఆపేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆవేశంగా ఊగిపోతూ మీదకు వస్తున్న కుమారుడి తీరును చూసి బయటకు పరుగు తీస్తున్న తండ్రిపై చిన్న ఇనుప బకెట్‌ను తలపైకి విసిరాడు. తల వెనుక భాగంలో బలంగా తగిలి కిందపడి ఉన్న తండ్రిపై పక్కనే ఉన్న బండరాయిని ఎత్తేశాడు. దీంతో అంజిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కూతురు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.